ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ విచారణ తుదిదశకు చేరుకుంది. ఆగస్టు 25న జరగనున్న ఈ కేసు తదుపరి విచారణ సందర్భంగా జగన్ కు జైలా? బెయిలా? అన్న సుదీర్ఘ ఉత్కంఠకు దాదాపుగా తెరపడుతుందని అంతా భావిస్తున్నారు.
దీంతో, తన బెయిల్ రద్దు కాకుండా ఉండేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ కేంద్ర మంత్రి కుమారుడి సాయంతో ఈ గండం నుంచి గట్టెక్కేందుకు జగన్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా జగన్ కు తాజాగా మరో షాక్ తగిలింది. జగన్ కు తాజాగా సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
అంతేకాదు, సెప్టెంబర్ 22న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. వాన్పిక్ ఈడీ కేసును న్యాయస్థానం విచారణకు స్వీకరించడంతో జగన్ కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వాన్ పిక్ కేసులో జగన్ తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణల, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్ టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎం.శామ్యూల్, మన్మోహన్ సింగ్లకూ కోర్టు సమన్లు జారీ అయ్యాయి. జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.