సాధారణంగా భారీగా పోలింగ్ శాతం నమోదైతే ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుంటారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తిన సంగతి తెలిసిందే. వైసీపీపై తీవ్రంగా ప్రజా వ్యతిరేకత ఉందని, అదంతా పోలింగ్ రూపంలో చూపించేందుకే ఓటర్లు అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అంటున్న సంగతి తెలిసిందే.
అయితే పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగడం, ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలు అందకపోవడంతో అధికారికంగా ఎంత శాతం పోలింగ్ నమోదయింది అన్న విషయాన్ని ఏపీ సీఈఓ మీనా అధికారికంగా వెల్లడించలేదు. సోమవారం అర్ధరాత్రి వరకు ఉన్న అంచనాల ప్రకారం 78% పోలింగ్ నమోదు కావడంతో అధికారికంగా పోలింగ్ 80 నుంచి 82% మధ్యలో ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఆ అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలో 80.66% పోలింగ్ నమోదైందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారని, ఓటర్లలో చైతన్యం వల్లే పోలింగ్ శాతం భారీగా పెరిగిందని మీనా అభిప్రాయపడ్డారు. ఇక, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.07 శాతం కలుపుకుంటే మొత్తం పోలింగ్ 81.73% ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల శాతం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇక, 2019లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని మొత్తం 79.80% పోలింగ్ నమోదయింది. 2019 తో పోలిస్తే 2024లో దాదాపు 2 శాతం పోలింగ్ అధికంగా జరిగింది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అయితే, 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని అనధికారికంగా అంచనా వేస్తున్నారు.