1776 జూలై 4న బ్రిటిష్ వలస పాలన నుండి ఉత్తర అమెరికా ఖండం లో ఉన్న 13 రాష్ట్రాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి.
స్వాతంత్రం తరువాత విడివిడిగా కొనసాగితే, మళ్లీ బ్రిటిషు సామ్రాజ్య వాదం నుండి ప్రమాదం రావొచ్చని అంచనా వేసిన ఈ 13 స్వతంత్ర రాష్ట్రాలు ….. ఒకే దేశంగా ఏర్పడాలని నిర్ణయించుకుని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పేరు పెట్టుకున్నారు.
కొత్త రాజ్యాంగం రూపొందించుకొని 1788-89 లో అమెరికా అధ్యక్ష పదవికి మొదటి సారిగా ఎన్నికలు నిర్వహించారు.
ఇప్పుడు అభివృద్ధిలో అందరికన్నా ముందున్న అమెరికా పౌర సమాజం, అప్పటికి చాలా వెనుకబడి ఉండేది.
అమెరికా అధ్యక్ష పదవికి 1788-89 లో మొదటి సారి ఎన్నికలు జరిగినప్పుడు,
చాలా మంది ఓటర్లు వెదురు గంపలు తీసుకొని పోలింగ్ బూత్ కి వచ్చారు.
గంపలు ఎందుకు తెచ్చారు? అని అడిగిన వారికి.. వాళ్ళు చెప్పిన సమాధానం…. ఎన్నికలంటే, పోటీ చేసిన నాయకులు, ప్రజలకు ఆహారం, బట్టలు, డబ్బులు, ఇతర నిత్యావసర వస్తువులు పంచుతారని… తమ వాళ్ళు చెప్పారని….. చెప్పారు.
ఆధునిక
ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రారంభమై, ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలు ఏర్పడే విధానం ప్రారంభమైన కొత్తలో, కొన్ని సమాజాలలో వెనుకబాటుతనం, అవగాహన రాహిత్యం వల్ల అలా జరిగింది.
కానీ ఈ రోజు హుజురాబాద్ ఎన్నికల్లో ఓటర్లు బహిరంగంగా పార్టీల నుండి ఓటుకు నోటు డిమాండ్ చేయటం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ వెనుకబాటుతనాన్ని, 75 సంవత్సరాల స్వతంత్ర భారత మేడిపండు అభివృద్ధి నిజస్వరూపాన్ని, అన్నిటికీ మించి ఓటుకు ఆరు వేల నుంచి 10000 ఖర్చు పెట్టగలిగిన ధనిక రాష్ట్రం తెలంగాణ లో అమలవుతున్న కెసిఆర్ మార్క్ ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా చూపిస్తున్నాయి.
ఓటుకు పదివేలు పంచేవాడు… తన పిల్లల కోసం తప్ప జనం పిల్లల కోసం పని చేస్తాడా?
ఎన్ని సార్లు ఎన్నికలు జరిగినా….
ఎన్ని ప్రభుత్వాలు మారినా….
ఈ దేశంలో నాయకులు మాత్రమే అభివృద్ధి చెందుతారు.
ఓటర్లు ఎప్పటికీ పేదల గానే మిగులుతారు.
ఇది 75 సంవత్సరాల స్వతంత్ర భారత వాస్తవ రాజకీయం.
కొలికపూడి శ్రీనివాసరావు