గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ‘ఒమిక్రాన్’ తో వచ్చే ముప్పు ఎంతన్న అంశంగా దేశీయంగా సరైన అంచనాలు లేని పరిస్థితి. కొందరు నిపుణులు.. దీనితో వచ్చే తిప్పలు చాలా ఎక్కువన్న మాట చెబుతుంటే.. మరికొందరు వైద్య నిపుణులు మాత్రం అందుకు భిన్నంగా.. ఒమిక్రాన్ తో వచ్చే ముప్పే లేదని.. దాని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పలుదేశాల్లో నమోదవుతున్న కేసులు కొత్త భయాల్ని తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ తో పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటం మినహా.. మరణాలు చాలా తక్కువన్న మాట పలువురి నోట వినటం.. మీడియాలో పలు కథనాలు రావటం తెలిసిందే. అందుకు భిన్నంగా తాజాగా వెల్లడైన ఒక అంచనా కొత్త ఆందోళనకు తెర తీసింది.
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రవేత్తల విశ్లేషణ చూసినప్పుడు ఈ వేరియంట్ ఎంత ముప్పు అన్న విషయం తెలిసేలా ఉంది. వీరి విశ్లేషణ ఏమంటే.. కొత్త వేరియంట్ కారణంగా ఏప్రిల్ చివరి నాటికి 25వేల నుంచి 75 వేల వరకు మరణాలు ఉండొచ్చన్న అంచనాను వేస్తున్నారు. వ్యాక్సినేషన్ కారణంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలను ఒమిక్రాన్ తప్పించుకోవటం కారణంగా.. రెండు టీకాలు వేసుకున్న వారు సైతం ఈ వేరియంట్ బారిన పడుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారంతో.. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ తీవ్రత ఎంతన్న విషయాన్ని వారు అంచనా వేస్తున్నారు.
తాజా అంచనాను మూడు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇందులో మొదటిది.. ఇప్పుడున్నట్లుగా ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగితే.. వచ్చే ఏప్రిల్ చివరి నాటికి రోజుకు 2 వేల మంది ఆసుపత్రుల్లో చేరుతారు. అప్పటికి మొత్తం 1.75లక్షల మంది ఆసుపత్రుల్లో చేరొచ్చు. 24,700 మందికి మరణ ముప్పు ఉంటుందని లెక్క వేశారు. అదే సమయంలో.. బూస్టర్ డోసులు అందించటం.. వైరస్ వ్యాప్తికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల 53 వేల కేసుల నమోదును తగ్గించటంతో పాటు.. మరణాలను 7600 మేర తగ్గే వీలుందని చెబుతున్నారు.
ఒకవేళ.. ఒమిక్రాన్ కు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకుండా.. వైరస్ మరింత తీవ్రంగా వ్యాప్తి చెందితే.. ఆసుపత్రిలో చేరే వారు 4.92 లక్షల మంది వరకు ఉండొచ్చని.. 74,800 మంది వరకు మరణాలు చెందే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ వేరియంట్ తో రోగ తీవ్రత తప్పించి.. మరణాలు ఇప్పటివరకు నమోదు కాలేదు. తాజాగా ఈ కొత్త వేరియంట్ కారణంగా ప్రాణం పోయిన ఉదంతం బ్రిటన్ లో చోటు చేసుకుంది.
ఇదే ప్రపంచంలో ఒమిక్రాన్ తొలి మరణంగా వైద్య ఆరోగ్య వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. త్వరలోనే ఒమిక్రాన్ తీవ్రత మరింత పెరగనుందని.. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్న కీలక వ్యాఖ్యను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. అర్హులైన వారంతా బూస్టర్ డోస్ వేసుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు. ఈ విశ్లేషణ మన దేశానికి యథాతధంగా పనికి వస్తుందని చెప్పటం లేదు కానీ.. ఒమిక్రాన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండేందుకు మాత్రం తోడ్పడుతుందని చెప్పక తప్పదు.