డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో ఫిదా ఒకటి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ విడుదలై నేటికి ఏడేళ్లు. ఈ సందర్భంగా ఫిదా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనంతరం శేఖర్ కమ్ముల `నీ ఎంగే ఎన్ అన్బే(తెలుగులో అనామిక పేరుతో విడుదలైంది)` అనే మిస్టరీ థ్రిల్లర్ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఆ సమయంలోనే శేఖర్ కమ్ముల ఫిదా స్టోరీ సుకున్నారు. హీరోగా మొదట టాలీవుడ్ సూపర్ మహేష్ బాబును అనుకున్నారు. కానీ స్టోరీ ఆయనకు నచ్చకపోవడంతో సున్నితంగా తిరస్కరించారు. ఆ వెంటనే శేఖర్ కమ్ముల రామ్ చరణ్ ను కలిశారు. అయితే చరణ్ సైతం తనకు ఈ స్టోరీ సెట్ కాదని నో చెప్పాడు. మహేష్ బాబు, రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథను ఫైనల్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పట్టుకున్నాడు. మలయాళంలో ప్రేమమ్ ద్వారా పాపులర్ అయిన సాయి పల్లవిని హీరోయిన్ గా శేఖర్ కమ్ముల ఎంపిక చేశారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఫిదా మూవీని నిర్మించగా.. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. సాయిచంద్, సత్యం రాజేష్, శరణ్య ప్రదీప్, రాజా చెంబోలు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. రూ. 13 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఫిదా చిత్రం 2017 జూలై 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పల్లెటూరి అమ్మాయి భానుమతిగా సాయి పల్లవి, ఎన్నారై అబ్బాయిగా వరుణ్ తేజ్ తమ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేశారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చక్కగా వర్కోట్ అయింది.
అలాగే రెండు లైన్ల చిన్న కథను రెండున్నర గంటలపాటు సినిమాగా తీసి ప్రేక్షకులను మెప్పించడంలో శేఖర్ కమ్ముల సూపర్ సక్సెస్ అయ్యారు. మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలు ఎంతో అద్భుతంగా చూపించారు. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించారు. ఇకపోతే ఫిదా సినిమా అప్పట్లో రూ. 90 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. నాలుగు ఫిల్మ్‌ఫేర్ తో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసింది.