సాధారణంగా ప్రభుత్వాలు ఏదైనా కూల్చేస్తామంటే.. ప్రజలు ఆందోళనకు దిగుతారు. కానీ, ఒడిశా ప్రభుత్వం ఓ పెద్ద పాఠశాల, పైగా 65 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పాఠశాలను కూల్చేసింది. దీనిపై స్థానికుల నుంచి హర్షం వ్యక్తమైంది. అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర ప్రమాదం బాలాసోర్ ప్రజలకు ఇంకా కళ్లముందే కదలాడుతోంది.
ఆ ప్రమాదానికి సంబంధించిన వార్తలు వింటేనే వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇక, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బహానగా ప్రభుత్వ పాఠశాలలో భద్రపర్చారు. ఇది అతి పెద్ద పాఠశాల. పైగా 65 కిందట నిర్మించారు. అయితే, అత్యవసరం కోసం ఇక్కడ 200 శవాలను భద్ర పరిచారు. ఇటీవల వాటిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. దీంతో ఇప్పుడు ఆ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు ఆ పాఠశాల భవనాన్ని తాజాగా కూల్చేశారు.
జూన్ 2వ తేదీన బాలేశ్వర్ లోని బహానగా రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదం గురించి తెలియగానే బహానగా వాసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 288 మంది దుర్మరణం చెందగా.. ఈ మృతదేహాలను తొలుత బహానగా హైస్కూల్‌కు తరలించా రు. ఈ పాఠశాలను తాత్కలిక శవాగారంగా మార్చారు. అనంతరం మృతదేహాలను ఇక్కడి నుంచి భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత స్కూల్‌ను శుభ్రం చేశారు.
అయితే అనేక మృతదేహాలను ఒకే చోట చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఈ ప్రదేశానికి వచ్చేందుకు జంకుతున్నారు. ఈ స్కూల్‌ను జూన్ 16న తిరిగి తెరవనున్నారు. అయితే, పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ధైర్యం చేయట్లేదని, వారి తల్లిదండ్రులు చిన్నారులను పంపించేందుకు నిరాకరిస్తున్నారని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా స్వేన్ తెలిపారు. మరోవైపు, 65 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనం కూడా దెబ్బతిందని ఆమె అన్నారు. దీంతో ఈ స్కూల్ భవనాన్ని కూల్చాలని పాఠశాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో కూల్చివేతకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఈ భవనాన్ని కూల్చివేశారు.