వైసీపీ నేతలలో చాలామంది నేర చరిత్ర కలిగి ఉన్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఒక ఫ్యాక్షనిస్ట్ అని, అందుకే ఆయన పార్టీకి చెందిన నేతలలో చాలామంది నేర స్వభావం కలిగి ఉన్నారని విపక్ష నేతలు విమర్శలు చేస్తుంటారు. టిడిపి నేతలు, కార్యకర్తలు, సామాన్యులపై కూడా వైసిపి నేతల దాష్టికాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వారు విమర్శిస్తుంటారు. ఆ విమర్శలకు తగ్గట్లుగానే ఓ వ్యక్తిపై దాడి కేసులో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు జైలు శిక్ష పడిన వ్యవహారం సంచలనం రేపుతోంది.
రామచంద్రారెడ్డి అనే వ్యక్తిపై 2008లో వాసుపల్లి గణేష్, దుర్గా రెడ్డిలు దాడి చేశారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే గణేష్ తో పాటు దుర్గారెడ్డిపై రామచంద్రా రెడ్డి కేసు పెట్టారు. తాజాగా, ఆ కేసు విచారణ పూర్తయింది. కోర్టులో నేరం రుజువు కావడంతో వాసుపల్లి గణేష్, దుర్గా రెడ్డిలకు 6 నెలల జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై గణేష్ పై కోర్టులో అప్పీలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ తీర్పు నేపథ్యంలో వాసుపల్లి గణేష్ పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వైసిపి నేతలలో చాలామంది నేర ప్రవృత్తి కలిగి ఉన్నారని, అందుకే రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని నెటిజనులు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు తాజాగా జరుగుతున్న ఘటనలు, ఇటువంటి జైలు శిక్షలు ఉదాహరణలని అంటున్నారు. ఇటీవల జరిగిన అర్చకుడి పై దాడి ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు.
కాగా, ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మరో 10 మంది మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న క్రిమినల్ కేసు నమోదైంది. 2018 ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్ అఫిడవిట్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆయనతోపాటు 10 మంది అధికారులపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.