అగ్రరాజ్యం అమెరికా లో తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మన దేశానికి చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలు కాగా.. వారిలో ముగ్గురు ఏపీకి చెందిన వారు కావటం గమనార్హం. మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం రాండాల్ప్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలు కాగా.. వారిలో ఒకరు మహిళగా చెబుతున్నారు.
మరణించిన ఐదుగురు ప్రవాసీ భారతీయుల్లో ముగ్గురు ఏపీకి చెందిన వారున్నారు. సౌత్ బాన్ హామ్ కు ఆరు మైళ్ల దూరంలోని స్టేట్ హైవే మీద అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6.45 గంటల వేళలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదగురు మరణించారు. మరణించిన వారి వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. ఈ ఘటనలో ఏపీకి చెందిన ముగ్గురు మరణించటంతో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ద్రష్టికి తీసుకొచ్చారు. ఈ యాక్సిడెంట్ మీద టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ దారుణ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన గోపి.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన శివ.. హరితలు మరణించిన వారిగా గుర్తించారు. హరిత భర్త సాయి చెన్ను తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై తెలుగు సంఘాల ప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.