ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కలకలం రేగింది. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రస్తుతం కలిసి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని సీట్లను బీజేపీ పట్టుబడుతోంది. ఫలితంగా ఆయా సీట్లపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలకు ఇబ్బంది ఏర్పడుతోంది. అయినప్పటికీ.. పొత్తు కోసం అనేక త్యాగాలు చేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు కోసం.. నేతలు.. మౌనంగా ఉంటున్నారు. ఇలానే ఆదోని సీటును పొత్తులో భాగంగా బీజేపీ కోరింది. దీనికి టీడీపీ కూడా ఓకే చెప్పింది. ఈ రోజో రేపో.. బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది. దీనిలో ఆదోని నుంచి కూడా అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
ఇంతలోనే ఉరుములు లేని పిడుగులా.. ఓ సంచలన ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. దీనిలో ఆదోని టికెట్ రేసులో ఉన్న బీజేపీ నాయకుడు ఒకరు.. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆదోని తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడుతో ఫోన్లో సంభాషించారు. ఈ సంభాషణలో..“ఆదోని టికెట్‌ను నీకే(టీడీపీ నేతకే) వదిలేస్తాం. నువ్వే పోటీ చేసుకో. కానీ, నాకు రూ.3 కోట్లు ఇవ్వు“ అని బీజేపీ నుంచి టికెట్ ఆశించిన నాయకుడు బేరానికి దిగారు. బీజేపీ నాయకుడు, కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు నాగరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఈ సంభాషణ జరిగింది.
ఎవరు లీక్ చేశారో కానీ.. ఈ వ్యవహారం అటు ఆదోనిలో.. ఇటు ఆలూరులోనూ కలకలం రేపుతోంది. ఈ అంశంలో పురందేశ్వరిని కూడా తీసుకువచ్చారు. “పురందేశ్వరే అడగమన్నారు“ అంటూ.. అటు వైపు నుంచి వ్యాఖ్యలు చేయడం మరింతగా దుమారానికి దారితీసింది. బీజేపీ అగ్రనేతలు సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి కేటాయించిన సీట్ల విషయంలో అభ్యర్థుల మధ్య పోటీ ఉందనుకుంటే.. ఇలా సీట్లు వదిలేస్తాం డబ్బులు ఇవ్వాంటూ టీడీపీ నేతలతో కొంత మంది బీజేపీ నేతలు బేరాలాడటం సంచలనంగా మారింది. దీనిపై రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇదేసమయంలో పొత్తు పార్టీలపైనా ఇది ప్రబావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.