“ఈ నియోజకవర్గంలో నన్ను తప్ప గెలిపించేందుకు ఎవరూ లేరు. ఇక్కడి ప్రజలకు నేను తప్ప మరొకరు లేరు. కాబట్టి ఎవరు పోటీ చేసినా.. నా విజయాన్ని ఆపేవారు కూడా లేరు“ -ఇదీ ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ ఎస్ అభ్యర్థి , మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పిన మాట. ఎందుకంటే.. ఆయనకు ఇక్కడ పట్టుంది. పైగా.. టీడీపీలో ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో విజయం దక్కించుకున్నారు.
అయితే.. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. కాబట్టి.. నాయకులు దూకుడును వారి అహంకారాన్ని ఎక్కడ ఎప్పుడు అణిచేయాలో వారికి తెలిసినంతగా.. నాయకులకు కూడా తెలియదు. ఇప్పుడు పాలకుర్తిలో అదే జరిగింది. పాలకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన మామిడాల యశస్విని.. ఊహించని విధంగా దూసుకుపోయారు. రౌండ్ రౌండ్‌కు తన సత్తా చూపించారు. తనకు తిరుగు లేదని వ్యాఖ్యానించిన ఎర్రబెల్లికి ఆమె చుక్కలు చూపించారు.
దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ.. తనదైన శైలిలో నియోజకవర్గాన్ని శాసించిన ఎర్రబెల్లిని చిత్తుగా ఓడించారు. ఏకంగా 46, 347ఓట్ల మెజారిటీతో యశస్విని మామిడాల 21వ రౌండ్నే దూసుకు పోయారు. నిజానికి ఇంత మెజారిటీని ఆమె కూడా ఊహించి ఉండరు. ఇక, తనదే విజయమని భావించిన ఎర్రబెల్లి కూడా ఈ మెజారిటీని అస్సలు ఊహించలేదు. అందుకే.. ఆయన 20వ రౌండ్ వచ్చే సరికే కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్లిపోయారు.
ఎర్రబెల్లి పరాజయానికి కారణాలు.. పరిశీలిస్తే, దూకుడు, తనకు తిరుగులేదనే భావన, ఎవరూ తనను ఓడించే వారు లేరనే అతి నమ్మకం.. ఆయనను పరాజయం పాల్జేశాయని అంటున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి బీఆర్ ఎస్ నాయకులతో ఆయనకు విభేదాలు ఉండడం.. తన పేరు చెప్పి, తన సోదరుడు చేస్తున్న రాజకీయాలను ఆయన అడ్డుకోలేక పోవడం.. వసూళ్లు వంటివి ఇప్పుడు ఆయనకు షాకిచ్చాయనేది స్థానికంగా జరుగుతున్న చర్చ. ఏదేమైనా.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. తొలి తరం నాయకురాలిపై మట్టికరవడం రికార్డేనని అంటున్నారు.