ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) డెట్రాయిట్లో 2025 జులై 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహించనున్న 24వ ‘తానా’ ద్వైవార్షిక మహాసభల నిధుల సేకరణ, సన్నాహక సమావేశంలో భాగంగా డెట్రాయిట్ లోని సెంట్ తోమా చర్చ్ లో అక్టోబర్ 19వ తేదీన నిర్వహించిన కిక్ ఆఫ్, ఫండ్ రైజింగ్ ఈవెంట్ విజయవంతమైంది.
ఈ సందర్భంగా డోనర్ల నుంచి 3 మిలియన్ డాలర్ల మేరకు నిధుల హామి లభించింది.
24వ ‘తానా’ మహాసభల కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు, కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ చాపలమడుగు మాట్లాడుతూ, ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలతోపాటు, మన సంప్రదాయాన్ని తెలియజేసేలా కార్యక్రమాల రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ మహాసభల వెన్యూ అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో డిట్రాయిట్ సబర్బన్ నోవీలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ ను ఎంపిక చేసినట్లు వివరించారు.
గతంలో వివిధ మహాసభలను నిర్వహించిన అనుభవంతో ఈ మహాసభలను కూడా తాము విజయవంతంగా నిర్వహిస్తామని ఉదయ్ కుమార్ చాపలమడుగు, గంగాధర్ నాదెళ్ళ తెలిపారు.
డిట్రాయిట్ సబర్బన్‌లోని నోవైలో ఉన్న తెలుగు కమ్యూనిటీ, డిటిఎ నాయకులు ఇందులో భాగస్వాములవుతున్నారని అందరి సహకారంతో ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ కు వివిధ ప్రాంతాల్లో ఉన్న తానా నాయకులంతా హాజరై తమవంతు తోడ్పాటును అందించేందుకు హామి ఇచ్చారు.
తమవంతుగా పలువురు ఈ కార్యక్రమంలో విరాళాలను ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగుతోపాటు కాన్ఫరెన్స్ ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, కో కో ఆర్డినేటర్ శ్రీనివాస్ కోనేరు, డైరెక్టర్ సునీల్ పాంట్ర, సెక్రటరీ కిరణ్ దుగ్గిరాల, ట్రెజరర్ జోగేశ్వరరావు పెద్దిబోయిన, తానా నార్త్ రీజినల్ రిప్రజెంటేటివ్ నీలిమ మన్నెతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రెసిడెంట్ ఎలక్ట్ నరేన్ కొడాలి, కార్యదర్శి రాజా కసుకుర్తి, ట్రెజరర్ భరత్ మద్దినేనితోపాటు ఇతర సభ్యులు, బోర్డ్ నుంచి చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, సెక్రటరీ లక్ష్మీ దేవినేని, ట్రెజరర్ జనార్ధన్ నిమ్మలపూడి, రవి పొట్లూరి, లావు శ్రీనివాస్ తదితర బోర్డ్ డైరెక్టర్లు, ఫౌండేషన్ నుంచి ట్రెజరర్ వినయ్ మద్దినేనితోపాటు ఇతర సభ్యులు, అలాగే వివిధ చోట్ల ఉన్న ‘తానా’ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
డిట్రాయిట్ నుంచి ‘తానా’కు సేవలందించిన 30 మంది సభ్యులను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు.
ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి 500 మందికిపైగా హాజరయ్యారు.
ఇటీవలే మరణించిన ‘తానా’ నాయకులు చలసాని మల్లిఖార్జున రావు, కొడాలి చక్రధర్ రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి సేవలను కొనియాడారు.
స్థానికుడైన ప్రస్తుత ‘తానా’ అధ్యక్షుడు ‘నిరంజన్ శృంగవరపు’ లేకుండా ఈ నిధుల సేకరణ కార్యక్రమం జరగటం మంచి పద్ధతి కాదని స్థానికులు మరియు ‘తానా’ అభిమానులు భావిస్తున్నారు .