ఏపీలో పోలింగ్ అనంతరం కొనసాగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం అదనపు భద్రతను కేటాయించింది. చంద్రబాబుకు 12+12..రెండు బ్యాచ్ లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అంతేకాదు నాయుడు నివాసంతో పాటు, టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కరకట్ట వెళ్లే మార్గాలలో తనిఖీలు నిర్వహించారు.
ఏపీలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు. వైసీపీ రౌడీల దాడులను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో మొదలైన హింస విశాఖకు కూడా చేరిందని వాపోయారు. వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించడంతో వారు టీడీపీకి ఓటేశారని నలుగురిపై విచక్షణారహితంగా వైసీపీ మూకలు దాడి చేశాయని ఆరోపించారు. దాడి చేసిన వారిపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పల్నాడులో ఇప్పటికీ శాంతిభద్రతలు అదుపులోకి రాలేదని, వైసీపీ రౌడీల ఇళ్లలో బాంబులు మారణాయుధాలు లభ్యమవుతున్నాయని ఆరోపించారు. పూర్తిస్థాయిలో పోలీసులు తనిఖీలు నిర్వహించి గూండాలను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాచర్లలో మారణ హోమం సృష్టించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని, అప్పుడే అక్కడ దాడులు ఆగే పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. తప్పు చేసిన పోలీసు అధికారులను బదిలీ చేయాలని వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఏపీలో పోలింగ్ తదనంతర హింసపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీలో అల్లర్లు అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, గొడవలు అరికట్టాలని ఏపీ సీఎస్, డీజీపీ, ఏపీ సీఈవో, జిల్లా ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది.