అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్రత్యేకమైన కారణం లేకుండానే కాల్పులకు పాల్పడే ఉన్మాదుల కారణంగా అమాయకులు పెద్ద ఎత్తున బలి అవుతుంటారు. అమెరికా గన్ కల్చర్ మీద పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. అక్కడి ఆయుధాల వినియోగం మీదా పరిమితులు పెట్టని వైనం విలువైన ప్రాణాలు పోయేందుకు కారణమవుతోంది. తాజాగా చోటు చేసుకున్న కాల్పుల్లో 22 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. మరో 60 మంది తీవ్ర గాయాల బారిన పడినట్లుగా చెబుతున్నారు.
లెవిస్టన్.. మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో భారీగా మరణాలు చోటు చేసుకున్నాయి. కాల్పుల సమాచారం తెలిసినంతనే.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లుగా చెబుతున్నారు. గాయాల బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని.. మరణాల సంఖ్య మరింత పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదు.
లెవిస్టన్ లో యాక్టివ్ షూటర్ ఉన్నాడంటూ మైనే స్టేట్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదే సమయంలో స్థానిక పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. సామూహిక కాల్పులకు పాల్పడిన దుండగుడి ఆచూకీ లభించని నేపథ్యంలో.. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని.. ఇళ్లల్లోనే ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ‘దయచేసి ఇంటి తలుపులు వేసుకొని.. ఇంట్లోనే ఉండండి. బయటకు రావొద్దు’’ అని పేరకొన్నారు.
ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం కాల్పులకు పాల్పడిన అనుమానితుడికి చెందిన రెండో ఫోటోల్ని షేర్ చేశారు. అతని కోసం పోలీసులుపెద్ద ఎత్తున గాలింపులు జరుపుతున్నారు.తాజాగా కాల్పులు జరిగిన ప్రాంతం లెవిస్టన్ ఆండ్రోస్కోగ్గిన కౌంటీలో భాగమని.. మైనే అతి పెద్ద నగరంగా చెబుతున్నారు. పోర్ట్ ల్యాండ్ కు ఉత్తరాన 56 కిలోమీటర్ల దూరంలో ఈ దురాగతం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
స్థానికుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..దుండగులు కాల్పులు జరిపిన ప్రాంతాల విషయానికి వస్తే.. స్పేర్ టైం రిక్రియేషన్.. స్కీంగీస్ బార్ అండ్ గ్రిల్ రెస్టారెంట్.. వాల్ మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద కాల్పులు జరిగినట్లుగా చెబుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.