టిడిపి అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా ఓర్వకల్లులో నిర్వహించిన రోడ్ షోకు అనూహ్య స్పందన వచ్చింది. సాధారణంగా తన రోడ్ షోలు, బహిరంగ సభల గురించి మాట్లాడేందుకు ఇష్టపడని చంద్రబాబు కూడా ఈ రోడ్ షోకు వచ్చిన జనాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోడ్ షోకే ఇంతమంది జనం వచ్చారంటే ఇక సభ నిర్వహించి ఉంటే ఓర్వకల్లు మొత్తం నిండి ఉండేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలో టిడిపి గాలి వీస్తుందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపిదే విజయమని, వైసిపి బంగాళాఖాతంలో కలవడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓర్వకల్లులో జరిగిన రోడ్ షో సందర్భంగా చంద్రబాబు కొంత భావోద్వేగానికి గురయ్యారు. మునుపెన్నడు లేని విధంగా చంద్రబాబు ఎమోషన్ అయిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దాదాపుగా 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలే తనకు చివరి ఎన్నికలంటూ చంద్రబాబు ఎమోషనల్ గా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరేనని, లేదంటే ఇక వారి ఇష్టం అంతా వారి చేతిలోనే ఉంది అని చంద్రబాబు భావోద్వేగానికి గురై వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. 2024 ఎన్నికల నాటికి చంద్రబాబుకు 75 ఏళ్ల వయసు ఉంటుంది. అంటే 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు వయస్సు 80 సంవత్సరాలు.
ఈ క్రమంలోనే అప్పటికీ ఆరోగ్యం, వయసు యాక్టివ్ పాలిటిక్స్ కు సహకరించకపోవచ్చు అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇక, ఈ క్రమంలోనే నారా లోకేష్ ను తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.