2020 ప్రపంచం మరిచిపోలేని సంవత్సరం. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు.. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాయి. వైరస్ ప్రభావానికి అన్ని రంగాలూ కుదేలయ్యాయి. అందులో సినీ పరిశ్రమకు జరిగిన నష్టం అలాంటిలాంటిది కాదు. ఆ వుడ్.. ఈ వుడ్ తేడా లేకుండా అన్ని భాషల సినీ పరిశ్రమలూ కరోనా ప్రభావంతో అల్లాడిపోయాయి. అందుకు మన టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. గత ఏడాది సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్‌లో కళే లేదు.
వేసవి నుంచి కరోనా విలయ తాండవంతో సినిమా వెలుగులకు చోటే లేకపోయింది. ఓటీటీల్లో కొన్ని సినిమాల సందడి మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐతే 2021లో కూడా కరోనా ప్రభావం లేకుండా ఏమీ లేదు. అయినా సరే.. ఈ ఏడాది తెలుగు సినిమా బలంగా పుంజుకుని నిలబడిరది. నిరుడు తనను ఓడిరచిన కరోనా మీద ఈసారి విజయం సాధించింది. దేశంలో అందరూ టాలీవుడ్ వైపు చూసేలా చేసింది.
ఆరంభం అదుర్స్
2020 చేదు జ్ఞాపకాల నుంచి బయట పడేసేలా మొదలైంది 2021. గత ఏడాది చివర్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీతో టాలీవుడ్ రీస్టార్ట్ ఆశాజనకంగా మొదలవగా.. సంక్రాంతికి సందడి చూసి అంతా ఆశ్చర్యపోయారు. తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే ‘క్రాక్’ సినిమా వసూళ్ల మోత మోగించింది. రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా సాధించిన భారీ విజయం తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఊపరిలూదింది.
సంక్రాంతికే విడుదలైన రామ్ సినిమా ‘రెడ్’, తమిళ అనువాద చిత్రం ‘మాస్టర్’ కూడా విజయవంతం అయ్యాయి. ‘అల్లుడు అదుర్స్’ చెత్త సినిమా అయినా సరే.. దానికి కూడా మంచి ఓపెనింగ్సే వచ్చాయి. సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ కొంచెం డల్ల అయినా.. మామూలుగా అన్ సీజన్ అయిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొన్ని చిత్రాలూ అనూహ్యమైన వసూళ్లు రాబట్టాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘ఉప్పెన’ గురించే.
కొత్త హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి.. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా కలిసి చేసిన ఈ ప్రేమకథా చిత్రం ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు ఎంత ఆకలితో ఉన్నారో ఈ సినిమా రుజువు చేసింది.
ఆ తర్వాతి నెలలో ‘జాతిరత్నాలు’ అనే కామెడీ సినిమా సైతం సంచలన వసూళ్లు రాబట్టింది. లో బడ్జెట్లో స్టార్ ఇమేజ్ లేని నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి బ్లాక్‌బస్టర్ అయింది. ఫస్ట్ క్వార్టర్లో అల్లరి నరేష్ మూవీ ‘నాంది’, ప్రశాంత్ వర్మ రూపొందించిన జాంబిరెడ్డి, యాంకర్ ప్రదీప్ ప్రధాన పాత్ర పోషించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కూడా విజయవంతం అయ్యాయి.
మంచి అంచనాల మధ్య వచ్చిన వైల్డ్ డాగ్, రంగ్ దె, శ్రీకారం చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్లుగా నిలిచాయి. అరణ్య, మోసగాళ్లు, చెక్, చావు కబురు చల్లగా లాంటి చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి.
ఇంకో రేంజిలో అనుకుంటే..
ఫస్ట్ క్వార్టర్లో ఓవరాల్‌గా చూసుకుంటే పరిస్థితి ఆశాజనకంగానే కనిపించింది. అన్ సీజన్లోనూ కొన్ని చిత్రాలకు భారీ వసూళ్లు రావడంతో ఇక వేసవిలో సందడి మామూలుగా ఉండదని అనుకున్నారు. ఆ సమయంలోనే ‘వకీల్ సాబ్’ లాంటి పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దాదాపు 15 నెలల తర్వాత తెలుగులో రిలీజైన టైర్-1 హీరో సినిమా ఇది. రీమేక్ మూవీ అయినా దానికి మంచి హైప్ వచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడం, పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చేలానూ మార్పులు చేయడంతో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాకు భారీ ఓపెనింగ్సే వచ్చాయి.
కానీ ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ తేవడం, అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరగడం సినిమా మీద ప్రభావం చూపింది. థియేట్రికల్ రన్ అర్ధంతరంగా ఆగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూల కారణంగా మూడు నెలల పాటు థియేటర్లు మూతపడ్డాయి. దీంతో మళ్లీ సినీ పరిశ్రమ సంక్షోభంలో పడేలా కనిపించింది.
అలా పుంజుకుని..
కరోనా ప్రభావం నుంచి కోలుకోవడంలో, పుంజుకోవడంలో తెలుగు సినిమా.. మొత్తం ఇండియాకు ఆదర్శంగా నిలిచింది. ఐతే మరోసారి కరోనా దెబ్బ తగలడంతో పుంజుకోవడానికి టాలీవుడ్ కూడా ఇబ్బంది పడిరది. సరైన సినిమాలు పడక.. జనాలు సెకండ్ వేవ్ దెబ్బకు భయపడిపోయి థియేటర్లకు రావడానికి భయపడటం వల్ల.. ఓటీటీల హవా మరింత పెరగడం వల్ల.. అలాగే ఏపీలో టికెట్ల రేట్ల సమస్య, నైట్ షోలు లేకపోవడం, 50 పర్సంట్ ఆక్యుపెన్సీ వంటి కారణాలతో బాక్సాఫీస్ అంత ఈజీగా పుంజుకోలేదు.
జులై నెలాఖర్లో థియేటర్లు పున:ప్రారంభం అయితే.. సెప్టెంబరు మూడో వారంలో ‘లవ్ స్టోరి’ వచ్చే వరకు థియేటర్లలో అంతగా సందడి లేదు. ఆ సినిమాకు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం, హౌస్ ఫుల్స్ పడటంతో మళ్లీ సినీ పరిశ్రమలో ఉత్సాహం వచ్చింది. దసరాకు వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, పెళ్లిసంద-డి చిత్రాలు కూడా బాగా ఆడాయి. సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన మిగతా చిత్రాల్లో సీటీమార్, ఎస్ఆర్ కళ్యాణమండపం, రాజ రాజ చోర, వరుడు కావలెను కూడా ఓ మోస్తరుగా ఆడాయి.
మహాసముద్రం, తిమ్మరసు, పాగల్, ఇచట వాహనములు నిలుపరాదు, శ్రీదేవి సోడా సెంటర్, గల్లీ రౌడీ, కొండపొలం, రొమాంటిక్, మంచి రోజులు వచ్చాయి, పెద్దన్న, పుష్పక విమానం రాజా విక్రమార్క, అనుభవించు రాజా తదితర చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి.
ముగింపు అదిరిపోలా
నవంబరు నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ పూర్తిగా డల్లయిపోయింది. ఈ నెలలో రిలీజైన ప్రతి సినిమా డిజాస్టరే. దీంతో ఒక రకమైన నైరాశ్యం నెలకొన్న సమయంలో డిసెంబరు తొలి వారంలో ‘అఖండ’ వచ్చి మళ్లీ బాక్సాఫీస్‌లో కళ తెచ్చింది. సరైన మాస్ మసాలా సినిమా లేక అల్లాడిపోతున్న ఆ వర్గం ప్రేక్షకులకు, అలాగే బాలయ్య స్టామినాకు తగ్గ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు ఈ సినిమా ఒక పండుగే అయింది.
సంచలన వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్‌కు మాంచి ఊపు తెచ్చింది. రాబోయే పెద్ద సినిమాలన్నింటికీ ఈ సినిమా మంచి ఉత్సాహాన్నిచ్చింది. దీని తర్వాత ‘పుష్ప’కు కూడా మాంచి హైప్ వచ్చింది.ఆ చిత్రం కూడా పెద్ద హిట్టయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి 2021కి అదిరిపోయే ముగింపు రావడంతో కొత్త ఏడాది ఆశాజనకంగా మొదలు కాబోతోంది. మన ఫిలిం మేకర్స్ ఎలాంటి సినిమాలు తీశారు.. ఏవి ఎంతమేర మెప్పించాయి.. సక్సెస్ రేట్ ఎంత అన్నది పక్కన పెడితే.. తెలుగు ప్రేక్షకుల సినిమా అభిరుచి ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
దేశంలో మరెక్కడా కరోనా తర్వాత ఈ స్థాయి సినిమా సందడి, ఇలాంటి వసూళ్లు, విజయాలు కనిపించలేదు. కరోనా భయాల్ని వదిలిపెట్టి మనవాళ్లు పెద్ద ఎత్తునే థియేటర్లకు వెళ్లారు. తమకు సినిమా వినోదం ఎంత ముఖ్యమో, సినిమా తమ జీవితంలో ఎంత కీలకమో చాటి చెప్పారు. ఇలాంటి ప్రేక్షకులున్నందుకు మన సినీ పరిశ్రమ అదృష్టం చేసుకుందనడంలో సందేహం లేదు.