మాజ్ మహారాజా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `భద్ర` ఒకటి. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా విడుదలైన నేటికి ఇరవై ఏళ్లు. ఈ సందర్భంగా భద్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ గా బోయపాటి శ్రీనుకు ఇదే తొలి చిత్రం. ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేసి డైరెక్షన్ పై పట్టు సాధించిన బోయపాటి.. భద్ర కథతో దిల్ రాజుకు వద్దకు వెళ్లారు. ఆయనకు స్క్రిప్ట్ నచ్చడంలో సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
అయితే చాలా మందికి తెలియని విషయం ఎంటంటే.. భద్ర మూవీకి ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదు. మొదట అల్లు అర్జున్ తో ఈ సినిమా తీయాలని బోయపాటి భావించారు. అందులో భాగంగానే బన్నీని కలిసి స్టోరీని నెరేట్ చేశారు. కానీ ఏవో కారణాలతో ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించగా.. ఆయన కూడా నో చెప్పారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాక ప్రభాస్ పేరునూ పరిశీలించారు. చివరకు రవితేజను హీరోగా సెలక్ట్ చేశారు.
అలాగే మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా.. అర్జన్ బజ్వా, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, ఈశ్వరీ రావు, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సుమారు రూ. 6 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన భద్ర మూవీ 2005 మే 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. సినిమాలోని సాంగ్స్ కూడా విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి.
తెలుగులో విజయవంతమైన భద్ర చిత్రాన్ని 2006లో తమిళంలోకి `శరవణ` పేరుతో రీమేక్ చేశారు. అక్కడ శింబు, జ్యోతిక జంటగా నటించారు. అలాగే 2008లో కన్నడలో `గజ` గా, 2010లో బెంగాలీలో `జోష్`గా మరియు బంగ్లాదేశీ బెంగాలీలో `భలోబేషే మోర్టే పరి`గా రీమేక్ చేయబడింది.