ఉత్తరాదికి చెందిన ఓ దోపిడీ దొంగల ముఠా….దక్షిణాది రాష్ట్రాల్లో వరుస దోపిడీలు, హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంది. ధనవంతుల ఇళ్లలోకి చొరబడి డబ్బు, నగలు దోచుకొని ఆ ఇంట్లోనివారిని దారుణంగా హతమార్చే ముఠా కోసం తమిళనాడుకు చెందిన ఓ పోలీసు అధికారి విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు. ఎట్టకేలకు ఆ పోలీసు అధికారి ఆ దొంగల ముఠా ఆటకట్టిస్తాడు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ డబ్బింగ్ సినిమా ఖాకీ సూపర్ హిట్ అయింది. దాదాపుగా ఆ సినిమాలోని సన్నివేశాలను తలపిస్తూ తమిళనాడులో పట్టపగలు జరిగిన ఓ చోరీ ఘటన ఇపుడు తమిళనాట సంచలనం రేపుతోంది. పట్టపగలు ఓ నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిని యూపీ దొంగల బ్యాచ్…17 కిలోల బంగారు నగలు దోచుకెళ్లడమే కాకుండా…అడ్డువచ్చిన ఆ ఇంటి యజమానురాలు, ఆమె కొడుకును కిరాతకంగా హతమార్చిన ఘటన దుమారం రేపుతోంది.
తమిళనాడులోని మైలాడుదురై జిల్లా శీర్గాళిలో ప్రముఖ నగల వ్యాపారి ధనరాజ్ చౌదరి (50) అనే నగల వ్యాపారి, ఆయన భార్య ఆషా (45), కుమారుడు అఖిల్ (24), కోడలు నిఖిల (20) నివసిస్తున్నారు. ధనరాజ్ చౌదరి కుదువ దుకాణంతో నగల టోకు వ్యాపారం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు సభ్యుల యూపీ దొంగల ముఠా….బుధవారం ఉదయం ధనరాజ్ ఇంట్లోకి చొరబడింది. కస్టమర్లు వచ్చారనుకొని తలుపు తీసిన ధనరాజ్ ను ఆ దుండగులు కత్తులతో బెదిరించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ధనరాజ్ భార్య ఆషా, కుమారుడు అఖిల్‌ను దుండగులు కత్తులతో పొడవడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ధనరాజ్, నిఖిలలపై కత్తులతో దాడి చేసి లాకర్లో భద్రపరచిన 17 కిలోల బంగారు నగలు, సీసీటీవీ కెమెరా హార్డ్ డిస్క్ ను దొంగిలించి ధనరాజ్ కారులో దోపిడీ దొంగలు పారిపోయారు.
దోపిడీ జరిగిన 4 గంటల తర్వాత కడలూరు జిల్లా ఇరుగూరు దగ్గర పంటపొలాల్లో నగలను దాచిపెడుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఖాకీ సినిమా మాదిరి….పంటపొలాల్లో ఆ ముగ్గురి పాదముద్రలను ఫాలో అవుతూ వెళ్లిన పోలీసులు…చివరకు దొంగలను చుట్టుముట్టారు. దొంగలు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా మణిపాల్ అనే దొంగ హతమయ్యాడు. మనీష్ (30), రమేష్ (25) అనే మిగతా ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేసి నగలు, 2 రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాచ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమిళనాడులో జరిగిన ఈ రియల్ “ఖాకీ” క్రైం సీన్…సోషల్ మీడియాలో వైరల్ అయింది.