రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు గాను 175 గెలుచుకోవాలని, అందుకోసం వైసీపీ ఎమ్మెల్యేలంతా కష్టపడాలని సీఎం జగన్ చాలాకాలంగా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పనితీరు బాగోలేని కొందరు ఎమ్మెల్యేలను తీసేస్తానని, వారికి రాబోయే ఎన్నికలలో టికెట్ కేటాయించబోనని జగన్ కరాకండిగా చెప్పేసినట్టుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు పని చేయకుంటే పంపించేస్తా అన్న రీతిలో జగన్ మాట్లాడే వారని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో జగన్ తీరు మారిందని టాక్ వచ్చింది.
అయితే, తాజాగా జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ మళ్ళీ పాత మనిషిగా మారినట్టుగా కనిపిస్తోంది. గతంలో మాదిరిగానే తాజాగా జరిగిన సమావేశంలో జగన్ వ్యాఖ్యానించడం షాకింగ్ గా మారింది. పనితీరు బాగున్న ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని, లేదంటే టికెట్ ఇచ్చే సమస్య లేదని జగన్ స్పష్టం చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలంతా గ్రాఫ్ పెంచుకోవాలని, గ్రాఫ్ బాగోలేని వారిని కొనసాగించే సమస్య లేదని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వల్లే ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరుగుతోందని జగన్ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారట.
సర్వేలలో ప్రతికూలంగా నివేదికలు వచ్చిన 18 మందిని కొనసాగించబోనని, టికెట్లు ఇవ్వడం కష్టమని హెచ్చరించారట. అటువంటి వారికి టికెట్లు ఇస్తే పార్టీకే నష్టమని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, రాబోయే తొమ్మిది నెలలు పార్టీకి అత్యంత కీలకమని, జగనన్న సురక్షలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలని జగన్ ఆదేశించారట. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని జగన్ సూచించారట.
రాబోయే సమావేశం నాటికి ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరుచుకోవాలని క్లాస్ పీకారట. దాదాపు 18 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వారిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడుతానని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సమిష్టి కృషితో రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుచుకుందామని, దానికోసం కష్టపడతామని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది.