ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వ్యవహారం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మరి కొద్ది గంటల్లో అధికారికంగా కొత్త కేబినెట్ పై ప్రకటన వెలువడనుంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అంటూ మీడియాలో కొత్త కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్న వారి జాబితా, పాత కేబినెట్ నుంచి కొత్త కేబినెట్ లోకి కొనసాగిన వారి జాబితా వైరల్ అవుతున్నాయి. కొత్త మంత్రివర్గంలోకి 10 మంది పాత వారికి అవకాశం కల్పించారని, 15 మంది కొత్తవారు కేబినెట్లోకి రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం, భవిష్యత్ అవసరాల ప్రాతిపదికన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, కొడాలి నాని, పేర్ని నాని, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్ లు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరి పనితీరు ఆధారంగానూ జగన్ మరో చాన్స్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.
ఇక, కొత్తగా ఏపీ మంత్రివర్గంలోకి కాకాణి గోవర్దన్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేశ్, విడదల రజనీ, రాజన్న దొర, మేరుగ నాగార్జున, పార్థసారథి, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, ధనలక్ష్మిలకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. ఇక, కొత్త క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాత్రి 7 గంటలకు కొత్త మంత్రివర్గ జాబితాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపిస్తామన్నారు.
నూతన మంత్రివర్గ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్లో ఉంచి రాజ్ భవన్ కు పంపుతామని, గవర్నర్ ఆమోదం తర్వాత సీఎం జగన్ ఫోన్ ద్వారా కొత్త మంత్రులకు సమాచారం అందిస్తారని సజ్జల వివరించారు. వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమం రేపు ఉదయం 11:31 గంటల నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొత్త, పాత మంత్రులు, అతిథులకు సచివాలయంలో జగన్ తేనేటీ విందు ఇస్తారు.