ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాడు పల్నాడు జిల్లాతోపాటు మరికొన్ని జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే, మిగతా జిల్లాల్లో పరిస్థితులు చక్కబడినా పల్నాడు జిల్లాతో పాటు అనంతపురం, తిరుపతి జిల్లాలో మాత్రం వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాలలో ఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయాలని నల జిల్లా కలెక్టర్ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తాడిపత్రిలో కూడా 144 సెక్షన్ విధించారు.
నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ సెక్షన్ అమల్లో ఉంటుంది. పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో ఈ రోజు వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాలలో దుకాణాలను పోలీసుల అధికారులు మూసి వేయించారు. అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా దుకాణాలు మూయించామని వారు చెబుతున్నారు. అంతకుమందు, మంగళవారంనాడు కారంపూడిలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మాచర్ల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ గుంటూరు రేంజ్ ఐజీ, నరసరావు పేట జిల్లా ఎస్పీలు మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట రామిరెడ్డిలను హౌస్ అరెస్టు చేశారు.
మరోవైపు, తాడిపత్రిలో వైసీపీ చేసిన మారణహోమానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ వైపు ప్రజలు నిలబడ్డారని పేర్కొన్నారు. జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మరోవైపు, తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలను పోలీసులు వేర్వేరు ప్రాంతాలకు తరలించారు.