ఓటుకు 2 వేలు, 5 వేలు, 10 వేలు ఇస్తున్న కాలంలో ఓటుకు రూ.1400 ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఇది ఓటరుకు ఇచ్చేది కాదు లెండి. దేశంలోని ఒక్కో ఓటరు మీద సగటున జరుగుతున్న అన్ని రకాల ఖర్చు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక్కో ఓటరుకు అవుతున్న ఖర్చు రూ.1400. మొత్తంగా 2024 లోక్ సభ ఎన్నికల ఖర్చు రూ.లక్ష 35 వేల కోట్లు అని అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం గమనార్హం.
2020లో జరిగిన అమెరికా ఎన్నికల ఖర్చు రూ.లక్ష 2 వేల కోట్లు అని అమెరికాకు చెందిన ఓపెన్ సీక్రెట్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత భారతదేశ ఎన్నికల ఖర్చు దానిని మించి పోతున్నది. 2019లో జరిగిన భారత పార్లమెంటు ఎన్నికల ఖర్చు రూ.60 వేల కోట్లు. ఈసారి దానికి రెట్టింపును మించి ఖర్చవుతుండడం విశేషం.
ఈసారి ఎన్నికల ఖర్చు రూ.లక్ష 2 వేలు అని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ అంచనా వేసింది. ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం బయటకు రావడం, ఎన్నికలకు ముందే అన్ని పార్టీలు చేస్తున్న ఖర్చులను ఈ సంస్థ పరిగణనలోకి తీసుకుని రూ.లక్ష 35 వేల కోట్లుగా అంచనా వేసింది. దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో 96.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సగటున ఒక్కో ఓటరుకు రూ.1400 ఖర్చవుతున్నది.
ఈ మొత్తం ఖర్చులో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమీషన్ పెట్టే ఖర్చు 10 నుండి 15 శాతం మాత్రమే. ఇక మీడియా సంస్థల ద్వారా పెట్టే ఖర్చు 30 శాతం అని అంచనా. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలలో ధనం కీలకపాత్ర పోషిస్తుండడం విచారకరం.