ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ను నిలువరించామని.. అప్పుడు జరిగిన యుద్ధంలో తాము అత్యత్తుమ ప్రదర్శనను ప్రదర్శించామని.. భారత్ తమ దెబ్బకు బెదిరిపోయిందని.. భారత్ పై తాము పైచేయి సాధించామని.. ఇలా సంబంధం లేని ఎన్నో కట్టుకథల్ని.. ఫేక్ న్యూస్ ను ప్రపంచ వ్యాప్తంగా విస్త్రతంగా ప్రచారం చేసిన పాక్ పాలకులు ఇప్పుడిప్పుడు వాస్తవాల్ని వెల్లడిస్తున్నారు. తమకు జరిగిన నష్టాల గురించి ఒప్పుకుంటున్నారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో తమకు చెందిన పదకొండు మంది సైనికులు మరణించారని.. మరో 78 మంది తీవ్రంగా గాయపడినట్లుగా వెల్లడించింది. అంతేకాదు పాక్ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది చనిపోయారని.. వీరిలో స్కాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు భారత్ చేపట్టిన ఆపరేషన్ లో 40 మంది పౌరులు చనిపోగా.. 121 మంది గాయపడ్డారని పేర్కొంది.
తాజాగా ఈ వివరాల్ని పాక్ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్ పీఆర్ వెల్లడించింది. నిన్నటి మీడియా సమావేశంలోనూ పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ మాట్లాడుతూ.. భారత్ తో జరిగిన సైనిక ఘర్షణల్లో తమ వాయుసేనకు చెందిన ఒక యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైనట్లు అంగీకరించారు. అయితే.. ఆ నష్టం ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు.
ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం ఏమంటే.. భారత వాయుసేనకు చెందిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి మీడియా బ్రీఫింగ్స్ లో మాట్లాడుతూ పాక్ యుద్ధ విమానాల్ని కూల్చేసినట్లు చెప్పటం తెలిసిందే. అయితే.. ఈ శకలాలు పాక్ లోనే పడిపోయానని చెప్పారు. కూలిన పాక్ విమానం మిరాజ్ కు చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు జరిగిన నష్టాల చిట్టా ఒక్కొక్కటిగా వెల్లడవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.