ప్రకాశం జిల్లాలో హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మున్నాతో కలిపి 11 మందికి మరణ శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో మరో 7గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మున్నా13 హత్య కేసుల్లో నిందితుడు కాగా నాలుగు కేసుల్లో నేరం రుజువైందని ఒంగోలు కోర్టు స్పష్టం చేసింది.
హైవేలపై ఇనుప రాడ్ల లోడ్ లతో వెళుతోన్న లారీడ్రైవర్లు, క్లీనర్లు లక్ష్యంగా మున్నా గ్యాంగ్ హత్యలకు పాల్పడింది. మున్నా గ్యాంగ్ పోలీసు వేషాలు ధరించి వచ్చిపోయే వాహనాలను ఆపి దోపిడీ చేసేవారు. తనిఖీల పేరుతో లారీడ్రైవర్లను, క్లీనర్లను మాటల్లో పెట్టి ఆ తర్వాత గొంతుకు తాడు బిగించి దారుణంగా హత్య చేసి లోడ్ తో సహా లారీలను అపహరించేవారు.
ఆ తర్వాత డ్రైవర్లు, క్లీనర్ల శవాలను గోతాల్లో కుక్కి వాగుల దగ్గర పూడ్చిపెట్టడం ఈ ముఠా మోడస్ ఆపరెంది. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన లారీలు, డ్రైవర్లు, క్లీనర్లు మిస్ కావడంతో పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాత ఇనుము అమ్మేవారిని విచారణ జరుపగా 2008లో మున్నా గ్యాంగ్ దురాగతాలు బట్టబయలయ్యాయి.
ఈ ఘటన గతంలోనే సంచలనం సృష్టించింది. 2008లో దేశం విడిచి పోవాలని చూస్తున్న మున్నాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మున్నా గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసు విచారణ ముగియడంతో మున్నాతోపాటు 11 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది.