కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్ గురించి వింత ప్రచారం జరుగుతోందని చెప్పాలి.
కరోనా కొత్తగా వచ్చినపుడు కూడా భయపడనంత ఎక్కువగా ఇపుడు ప్రభుత్వాలు భయపడుతున్నాయి.
ఎందుకింత భయపడుతున్నారు అని ఆలోచిస్తే దీనికి కారణం ఒకటి అర్థమైంది. కరోనాతో ప్రభుత్వాల ఆదాయ వ్యయాలు దారుణంగా తిరగబడ్డాయి. దీంతో ప్రజలకంటే కూడా ప్రభుత్వాలే ఎక్కువ భయపడుతున్నాయి. అందుకే అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
తాజాగా తెలంగాణలో అధికారులు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలనే నిబంధనను మరోసారి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమానా విధిస్తారు. మాస్క్ ధరించని వారి పట్ల పౌరులపై నిఘా ఉంచాలని రాష్ట్ర శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించింది.
గతంలో అసెంబ్లీ సాక్షిగా ఎవరూ మాస్కు వాడొద్దని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వమే ఇపుడు ఫైన్ వేయడం ఒక విచిత్రం. సర్లే ఎన్నో అనుకుంటాం జరుగుతాయా?
మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రపరచడం మరియు సామాజిక దూరం పాటించడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టమని ప్రజలను ప్రభుత్వాలు బతిమాలుతున్నాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు టీకాలు వేసుకోవడం ద్వారా కరోనాను తరిమేయాలని ప్రభుత్వం కోరుతోంది.
ఆరోగ్య శాఖ బృందాలు బహిరంగ ప్రదేశాలను కూడా సందర్శిస్తాయని, వ్యాక్సిన్ సర్టిఫికేట్ల కోసం ప్రజలను యాదృచ్ఛికంగా అడుగుతాయని ఆయన అన్నారు. ప్రజలు తమ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలని కోరడం మరీ విచిత్రం.
ఆ కార్యక్రమం రద్దు
డిసెంబర్ 5న ట్యాంక్ బండ్ వద్ద మరియు చార్మినార్ వద్ద నిర్వహించాల్సిన సండే ఫండే కార్యక్రమాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అర్హులైన పౌరులందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. మొదటి డోసు వేసుకున్న వారిలో దాదాపు 25 లక్షల మంది టైం అయిపోయినా రెండో డోస్ తీసుకోలేదని చెప్పారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే పదిహేను లక్షల మంది రెండో డోస్ తీసుకోలేదు. రాష్ట్రంలో 2.77 కోట్ల మందిలో 90 శాతం మంది ఇప్పటివరకు మొదటి డోస్‌ను తీసుకోగా, 45 శాతం మంది రెండవ డోస్ తీసుకున్నారని చెప్పారు.