కేంద్రం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటివరకు సినిమా థియేటర్లు.. మల్టీఫ్లెక్సుల్లో సీట్ల సామర్థ్యాన్ని వంద శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో నెలల పాటు థియేటర్లను.. మల్టీఫ్లెక్సుల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఓపెన్ చేసినా యాభై శాతం ఆక్యుపెన్సీతో పున: ప్రారంభించేందుకు అనుమతిని ఇచ్చారు. అయినప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు.. మల్టీఫ్లెక్సుల్నిఓపెన్ చేయలేదు. ఈ మధ్యనే ఒకటి తర్వాత ఒకటి చొప్పున థియేటర్లను.. మల్టీఫ్లెక్సుల్ని ఓపెన్ చేస్తున్నారు. ఈ రోజుకు కొన్ని మల్టీఫ్లెక్సుల్ని ఓపెన్ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులు పట్టాల మీదకు ఎక్కటంతో పాటు.. షూటింగ్ లు వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ నుంచి సినిమాలు వరుసగా రిలీజ్ కానున్నాయి.
ఇలాంటివేళ..కేంద్ర సమాచార.. ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి నూరుశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకునేందుకు అనుమతులు జారీ చేసింది. అదే సమయంలో కరోనా మార్గదర్శకాల్ని కచ్ఛితంగా పాటించాలని యాజమాన్యాలకు కేంద్రం సూచన చేసింది. దీంతో.. రేపటి నుంచి (సోమవారం) థియేటర్లలో నూరుశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు రన్ చేసుకోవచ్చు. టికెట్లు కొనుగోలు చేసే ప్రాంతంలోనూ.. వెలుపుల వెయిటింగ్ రూమ్స్ వద్ద ప్రేక్షకులు తప్పనిసరిగా ఆరు అడుగుల దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలి. థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఎంట్రీపాయింట్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు ఉండాలి. హ్యాండ్ వాష్.. శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. థియేటర్ లో ఉష్ణోగ్రత 24 – 30 డిగ్రీల మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మరి.. నూరుశాతం ఆక్యుపెన్సీ ప్రకటనపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.