పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైన ఘటన సంచలనం రేపింది. కేసీఆర్ కాన్వాయ్ లోని 10 వాహనాలు ఒకదానికొకటి ప్రమాదవశాత్తు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ వెళ్తున్న సందర్భంగా వేములపల్లి వద్ద ఒక వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో మిగతా వాహనాలు ఒకదానిని ఒకటి ఢీ కొన్నాయని తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో బీఆర్ఎస్ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత మిర్యాలగూడ సభలో ప్రసంగించిన కేసీఆర్…సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చర్లపల్లి జైల్లో వేస్తామంటున్నారని, అలాంటి వాటికి తాను భయపడతానా అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. 15 ఏళ్లు కష్టపడి తెలంగాణను సాధించుకున్నామని, అటువంటి తనను జైల్లో వేస్తామంటున్నారని వాపోయారు. పేగులు తీసి మెడలో వేసుకుంటాం, గుడ్లు తీసి గోలీలు ఆడుతాం అంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి భాష ఉందని రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. అబద్ధాలు చెబుతూ శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారనిచ ప్రజలు ఆలోచన చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ జయంతి రోజున ముఖ్యమంత్రి, మంత్రులు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లలేదని కేసీఆర్ విమర్శించారు. రైతుబంధు గురించి అడిగితే చెప్పుతో కొడతానని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో విద్యుత్ కోతలు లేవని మిగులు విద్యుత్ ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను కేఆఎంబీకి అప్పగించారని, రైతుబంధులో దగా చేశారని, రైతు బీమా ఉంటుందో లేదో తెలియదని విమర్శించారు. 10-12 ఎంపీలను గెలిపించాలని, అప్పుడు భూమి ఆకాశం ఒకటి చేసి ప్రజల కోసం పోరాడుతామని అన్నారు.