వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన సొంతూరు భీమవరం చేరుకున్న సంగతి తెలిసిందే. హైకోర్టులో తనకు రక్షణ కల్పించాలని కోరి మరి కన్నతల్లి వంటి సొంత ఊరికి ఆయన చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామకు దారి పొడుగునా ఆయన అభిమానులు, జనసేన, టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించి పూల వర్షం కురిపించి రఘురామకు స్వాగతం పలికారు.
ఈ క్రమంలోనే రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సొంత ఊరికి, నియోజకవర్గానికి రాకుండా ఇన్నాళ్లు ఇబ్బంది పెట్టారని జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రఘురామ ప్రకటించారు. ఇక, ఈ కూటమితో బిజెపి కూడా కలుస్తుందని భావిస్తున్నానని, 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని తాను అనుకుంటున్నానని రఘురామ చెప్పారు.
ఫిబ్రవరి రెండో వారంలో వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని రఘురామ ప్రకటించారు. ఆ సమయానికి టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. రఘురామ మాటలను బట్టి ఆయన టిడిపి-జనసేన లేదా టిడిపి-జనసేన-బిజెపి కూటమి తరఫున నరసాపురం లోక్ సభ స్థానం నుంచి ఆయన బరిలోకి తిరిగి అవకాశం ఉందని తెలుస్తోంది.