ఆంధ్రప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’తో మంచి ఫలితాన్ని అందుకున్నాడు దర్శకుడు మహి.వి.రాఘవ్.
దివంగతుడైన వైఎస్ జీవితాన్ని హృద్యంగా తెరపైన చూపించడంలో అతను సక్సెస్ అయ్యాడు.
అప్పటి జనాల మూడ్‌కు తగ్గట్లే ఈ సినిమా విజయం సాధించింది. తర్వాతి ఐదేళ్లలో మహి ఇంకో ఫీచర్ ఫిలిం తీయలేదు.
ఇప్పుడు ‘యాత్ర’కు కొనసాగింపుగా.. ‘యాత్ర-2’ను రెడీ చేశాడు.
ఈసారి వైఎస్ తనయుడు జగన్ బయోపిక్‌తో వస్తున్నాడతను.
ఐతే చనిపోయిన వైఎస్ మీద బయోపిక్ తీస్తే జనాలు ఎమోషనల్ అయ్యారు.
కానీ ఇప్పుడు జీవించి ఉంటూ ముఖ్యమంత్రిగా అధికారం అనుభవిస్తున్న వ్యక్తి మీద బయోపిక్ తీస్తే అంత ఎమోషన్ ఉంటుందా అన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి.
దీనికి తోడు ట్రైలర్లో చూపించిన కొన్ని అంశాలకు, వాస్తవంగా జనం చూస్తున్నదానికి తేడా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ అవుతుందేమో అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఐతే మహి తీసింది ఫక్తు పొలిటికల్ సినిమా. అందులో చూపించిందంతా నాణేనికి ఒక వైపే అని ట్రైలర్ చూస్తే అర్థమైంది.
అలాంటపుడు మీడియా వాళ్లు సినిమాలో చూపించిన రాజకీయ అంశాలపై ప్రశ్నలు వేస్తే అందుకు మహి సమాధానం చెప్పాల్సిందే.
కానీ అతను ‘యాత్ర-2’ ప్రెస్ మీట్లో మీడియా వాళ్ల ప్రశ్నల పట్ల అసహనం వ్యక్తం చేశాడు. మీరు సినిమాలో జగన్ ఎవరికీ భయపడడు, తలవంచడు అన్నట్లు చూపించారు, కానీ ఆయనేమో బయటికి వస్తే పరదాలు కట్టించి, చెట్లు కొట్టించి తిరుగుతున్నారు కదా అంటే.. మహి ‘‘మీరు సినిమా రిపోర్టరా.. పొలిటికల్ రిపోర్టరా’’ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు.
అంతే కాక పరదాలు కట్టుకున్నా పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నాడు కదా అన్నాడు.
అంతే కాక సోషల్ మీడియాలో అందరూ బురద చల్లుతూ ఉంటారని.. కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడని.. వేరే పార్టీల్లోనూ లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. తాను వివాదాల జోలికి వెళ్లను అంటూనే కొంత వివాదాస్పదంగానే మాట్లాడాడు మహి.