ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ పెద్దలు టీఆర్ ఎస్ నేతలకు వల విసురుతున్నారని చెప్పారు. అలాంటి కుట్రలను తాము సహించేది లేదన్నారు. అదేసమయంలో పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిజానికి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి అయితే కనిపించలేదు.
కానీ, కేసీఆర్ చేసిన కామెంట్లు మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలపై తాజాగా స్సందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాలకు, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని, తెలంగాణ రాజకీయ పరిస్థితుల కోణంలో సీఎం కేసీఆర్ మాట్లాడి ఉంటారని సజ్జల పేర్కొన్నారు.
అయినప్పటికీ, వారి(తెలంగాణ) ఉచ్చులో తాము పడబోమని స్పష్టం చేశారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి అజెండాతోనే పనిచేస్తుందని, ఇతర రాష్ట్రాల వ్యవహారాల గురించి పట్టించుకోబోమని సజ్జల తేల్చి చెప్పారు. తెలంగాణ నేతల వ్యాఖ్యలు వారి రాష్ట్రానికే పరిమితమన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చే ఆసక్తి సీఎం జగన్ కు కూడా లేదని తెలిపారు.
అయితే, తాజాగా సజ్జల చేసిన ఈ వ్యాఖ్యలపై విశ్లేషకులు రియాక్ట్ అవుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తూ, వారు చెప్పిన దానికి డూడూ బసవన్న మాదిరిగా తలలూపే ఏపీ నేతలకు ఎలాంటిఇబ్బంది ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం చెప్పిన అన్నింటినీ చేసుకువస్తున్నారని, రైతులకు ఇబ్బంది అయినా మీటర్లు పెడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాదు, చెత్తపై పన్ను వేయాలన్న కేంద్రం సూచనలను తప్పకుండా పాటిస్తున్నారని, రాజ్యసభ సీట్లు కావాలంటే ఇచ్చేస్తున్నారని, మరి ఇన్ని చేస్తుంటే మోడీ మాత్రం ఎందుకు తంపులు పెడతారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇవన్నీ చేయనందుకే, ధాన్యంకొని రైతులను ఆదుకొమ్మన్నందుకే తెలంగాణలో మోడీ వీరప్రతాపం చూపుతున్నారని అంటున్నారు.