మాజీ మంత్రి,, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణకు జీవన్మరణ సమస్య ఏర్పడింది. వరుస వైఫల్యాలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. అయితే.. అదేసమయంలో వైసీపీ అధినేత జగన్ ఆయనను ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం `ఇప్పుడైనా` తాను జగన్కు గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే.. అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదని మోపిదేవికి అప్పుడే అంచనాలుస్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆయనకు చెమటలు పడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.
వీటిలో మాజీ మంత్రి మోపిదేవి సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా రేపల్లె కూడా ఉంది. ఇది నగర మునిసిపాలిటీ. ఇక్కడ వైసీపీని గెలిపించాలని ఆయన భావిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఆయన ఈ నియోజకవర్గంలో ఘోర పరాజయం చవి చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలులు వీచినా.. ఇక్కడ మాత్రం టీడీపీ నాయకుడు, అనగాని సత్యప్రసాద్ వరుస విజయాలు సాధించారు.
ఆయన దూకుడు ఓ రేంజ్లో ఉంది. ఇప్పుడు దీనిని తట్టుకుని.. మోపిదేవి ఇక్కడ వైసీపీని గట్టెక్కించేందుకు నానా ప్రయాస పడుతున్నారు. వాస్తవానికి మోపిదేవి గత 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయినప్ప టికీ.. జగన్ మాత్రం.. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.
తర్వాత.. బీసీ కోటాలో రాజ్యసభకు పంపించారు. ఇంతగా జగన్ ప్రాధాన్యం ఇస్తూ.. వైసీపీలో కీలక నేతగా చూస్తున్నారు. అయితే.. మోపిదేవి మాత్రం.. దీనికి అనుగుణంగా అడుగులు వేయలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. అనగాని దూకుడుతో రేపల్లె వైసీపీలో గుబులు పట్టుకుంది. ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు ఒక్కరు కూడా వెనక్కి తీసుకున్న దాఖలా కనిపించలేదు. పైగా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు.
వైసీపీని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే సత్యప్ర సాద్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రతి అభ్యర్థి వెంటా తిరుగుతున్నారు. దీంతో ఒకరకంగా.. వైసీపీ వెనుకబడినట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి వెంకట రమణ హవా ఎక్కడా కనిపించడం లేదు. ఆయన వాయిస్ కూడా వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో తనను ఎంతో గౌరవంగా చూస్తున్న జగన్కు ఈ మాత్రం గిఫ్ట్ కూడా ఇవ్వలేమా? అని మోపిదేవి తర్జన భర్జన పడుతుండడం గమనార్హం.