పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ (37) మృతి చెందిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంజీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే మాగంటి రాంజీ మృతి పట్ల టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.
మాగంటి రాంజీ టీడీపీ కార్యకలాపాల్లో ఎంతో చురుకుగా పాల్గొనే వారని, రాంజీకి ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందనుకున్నామని చంద్రబాబు ట్వీట్ చేశారు. చిన్న వయసులోనే రాంజీ అర్థాంతరంగా అందరికీ దూరమైపోవడం బాధాకరమని, రాంజీ మృతి. పార్టీకి తీరని లోటని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి బాబుగారికి, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని చంద్రబాబు ప్రార్థించారు.
కాగా, రాంజీ అనారోగ్యానికి కారణాలు తెలియాల్సి ఉంది. రాంజీ ఆత్మహత్యాయత్నం చేశారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే, రాంజీ మృతికిగల కారణాలపై కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. మరోవైపు, రాంజీ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. టీడీపీలో యువనేతగా ఉన్న మాగంటి రాంజీ.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉండే రాంజీ…హఠాత్తుగ తిరిగిరాని లోకాలకు వెళ్లడం కార్యకర్తలను, అభిమానులను కలచివేస్తోంది. మాగంటి రాంజీకి ఆశ్మకు శాంతి చేకూరాలని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.