“రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చౌదరి.. ప్రతిపక్ష చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ.. ఆయన తీసుకునే నిర్ణయాలు వెగటు పుట్టిస్తున్నాయి“- ఇదీ గత ఏడాది.. స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన కామెంట్.
అంటే.. ఎస్ ఈసీ.. ప్రతిపక్షం చెప్పినట్టు నడుస్తోంద ని.. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థ.. ప్రతిపక్ష నేత కనుసన్నల్లో పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. దీంతో జగన్ అనుకూల మీడియాలో అందరూ విలపించారు. నిజమే కదా.. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రమేష్ కుమార్ .. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ.. శోకాలు పెట్టారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఎస్ ఈసీ మారారు. నిమ్మగడ్డ రమేష్ రిటైర్ అయ్యారు. మరి అప్పుడు జగన్ చెప్పిన `స్వతంత్రత` ఇప్పుడు పాటిస్తున్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నాడు చేసిన ఆరోపణలు నిజమని కొద్ది సేపు అనుకుంటే.. జగన్ ఇప్పుడు చేస్తోంది ఏంటి? ప్రస్తుత ఎస్ ఈసీని ఆయన , ఆయన పరివారం ఆడిస్తున్నారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
నిజానికి కొత్తగా వచ్చిన ఎస్ ఈసీపై ఎలాంటి ఆరోపణలు లేవని.. కెరీర్లో క్లీన్ ఇమేజ్, క్లీన్ రికార్డు ఉందని నిర్ధారించుకున్న తర్వాతే.. గవర్నర్ ఆమెకు ఆ సీటు అప్పగించారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవి నిజమైతే.. ఆమె ఎలా వ్యవహరించాలి? ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
ప్రధానంగా రెండు విషయాలు.. తాజా ఎస్ ఈసీ సాహ్ని నిజాయితీకి, స్వతంత్రతకు పెను పరీక్షగా మారాయి. ఒకటి.. అఖిల పక్ష సమావేశం. ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం రాష్ట్రంలో మిగిలిపోయిన పరిషత్ ఎన్నికలను ముగించాలనేది నిర్ణయం.
ఈ ఎన్నికలను ఎలా నిర్వహించాలి? ఎలా ముందుకు వెళ్లాలి? ఎప్పుడు నిర్వహించాలనే విషయాలపై సదరు పార్టీల నేతలతో చర్చించిన తర్వాత.. ఆమె నోటిఫికేషన్ లేదా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. ఈ విషయంలో ఆమె పారదర్శంగా ఎక్కడా వ్యవహరించలేదని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే.. అఖిల పక్ష భేటీకి ముందు రోజు రాత్రే హడావుడిగా.. పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చేశారు.
ఇక, రెండో విషయం. ఇంత అత్యంత వేగంగా.. ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒకపక్క తిరుపతి పార్లమెం టు ఉప పోరు జరుగుతోంది. ఇది ఈ నెల 17న పూర్తవుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తే.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ, అలా చేయలేదు. ముందుగానే షెడ్యూల్ ఇచ్చేసి.. తర్వాత పార్టీలతో అఖిలపక్షం అంటూ.. ప్రకటించడం ఏం విశ్వసనీయత?
అదేవిధంగా ఎవరైనా ఏ పరిషత్ నియోజకవర్గంలో అయినా.. ప్రచారం చేసుకునేందుకు నిబంధనల మేరకు కనీసం 14 రోజుల గడువు ఇవ్వాలి. ఇప్పుడు దీనిని ఆమె నాలుగు రోజులకు కుదించారు. అంటే ఇతర పార్టీలను డోలాయమానంలో పడేయడమే.! దీనిని ఎలా సమర్ధించుకుంటారు?
అదేసమయంలో ఏకగ్రీవాలపై కేసులు నమోదయ్యాయి. అనేక మంది అభ్యర్థులు సైతం ఎస్ ఈసీకి ఫిర్యాదులు చేశారు. అయినా .. వాటిని పరిష్కరించకుండానే ఎన్నికలకు వెళ్లడం ఎలాంటి సంకేతాలు పంపిస్తోంది? ఏదేమైనా.. ప్రస్తుతం ఎస్ ఈసీ తీసుకున్న నిర్ణయం.. వెనుక ప్రభుత్వం ఉందనే వాదనను కాదనలేని పరిస్థితి ఏర్పడింది. మరి దీనికి సీఎం జగన్ ఎలాంటి సమాధానం చెబుతారు? నాడు సుద్దులు చెప్పి.. స్వతంత్రతపై క్లాస్ పీకి.. ఇప్పుడు అదే స్వతంత్రతను తాను తీసుకున్నారా? అనేది తేలాల్సి ఉంది.