2019 ఎన్నికలకు కొద్ది కాలం ముందు… దారుణ హత్యకు గురైన వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, ప్రస్తుతం సీఎం జగన్ కు చిన్నాన్న.. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె.. డాక్టర్ నర్రెడ్డి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చ ఎన్నికల్లో `నర హంతకులకు ఓటెయ్యొద్దు` అని తాజాగా ఆమె మరోసారి పిలుపునిచ్చారు. వాస్తవానికి గత నెలలోనే సునీత .. ఢిల్లీలో మీడియా మీటింగ్ పెట్టి మరీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో హంతకులకు ఓటు వేయొద్దంటూ.. ఆమె పరోక్షంగా వైసీపీ ప్రస్తావన లేకుండానే ఆ పార్టీని ఎండగట్టారు.
తాజాగా సీఎం జగన్.. `మేం సైతం సిద్ధం` పేరుతో ఎన్నికల ప్రచార యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆయన బుధవారం కడపలో మాట్లాడుతూ… హంతకులను పక్కన పెట్టుకున్నారంటూ.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తన చెల్లెళ్లను తనపైకే ఉసి గొల్పుతున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సునీత. `చిన్నాన్నను చంపితే హంతకులెవరో.. సీఎం జగన్ తేల్చలేదు. పైగా నాపైనే నిందలు వేస్తున్నారు` అని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు.. `మీ చెల్లి కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే.. అన్నగా, సీఎంగా మీరేం చేశారు? ` అని సునీత నిలదీశారు. వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వివేకాను హత్య చేయించారని.. అప్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పినట్టు తెలిపాడని అన్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. పైగా మీరు(జగన్) వారినే రక్షిస్తున్నారని అన్నారు. అంతేకాదు.. హంతకుడిని పక్కనే పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేసేందుకు మనసు ఎలా వచ్చిందంటూ.. పరోక్షంగా ఎంపీ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. దీనికి వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.