ఏపీ సీఎం జగన్ తన ప్రభుత్వంలోను, కొన్ని రాజ్యాంగపరమైన పదవుల విషయంలోనూ తనతో అత్యంత సన్నిహిత ఆర్థిక సంబంధాలను నెరిపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు సమయం నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు నియామకాలను పరిశీలిస్తే.. జగన్ వ్యవహారం కళ్లకు కడుతుంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎం జగన్ కొనసాగించారు. ఈయన గత వైఎస్ హయాంలో జగన్‌కు మేళ్లు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నవారే.
ఇక, 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణకు ఆఘమేఘాలపై ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి.. వెంటనే కేబినెట్లోకి తీసుకున్నారు జగన్. ఇది కూడా విమర్శలకు దారితీసింది. మోపిదేవి కూడా మేళ్ల కేసులోనే కొన్నాళ్లు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. ఇక, సీనియర్ ఐఏఎస్ అధికారిణి.. శ్రీలక్ష్మి కేసు కూడా ఇదే బాపతు. వాస్తవానికి ఆమె తెలంగాణ కేడర్‌లో అక్కడే పనిచేస్తున్నప్పటికీ.. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆమె ఏపీకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. కేంద్రం ఈవిషయంలో కొన్నాళ్లు వారించినా.. పట్టుబట్టి.. జగన్ ఆమెను ఏపీకి తెచ్చుకుని.. ప్రమోషన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కీలక శాఖలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నారు. ఆమె కూడా గతంలో జగన్ మేళ్ల కేసులోనే జైలు జీవితం గడిపారు.
ఇక, తాజాగా మరో సంచలనం దిశగా జగన్ అడుగులు వేశారు. తనకు మేళ్లు చేసిన కేసుల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ శామ్యూల్‌ను ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ ఈసీ) కమిషనర్‌గా నియమించేందుకు సిఫారసు చేశారు. వాస్తవానికి ఆయన పేరునే సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రతిపాదించారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నారు. ఆయన ఎంపిక లాంఛనమేనని కూడా అంటున్నాయి. ప్రస్తుతం మూడు పేర్లలో ఫార్మాలిటీ కోసం.. గవర్నర్ వద్దకు జాబితాను పంపించినా.. ఎంపిక విషయంలో సీఎం జగన్.. మాజీ ఐఏఎస్ .. శామ్యూల్ వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. దీనిలో మరో కోణం కూడా ఉందని సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శామ్యూల్‌ను ఎంపిక చేయడం ద్వారా ఆ వర్గాన్ని తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి జగన్ వ్యూహం.. అంతా .. తన `బ్యాచ్`ను రక్షించుకోవడమేననే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.