అన్నగారి ఎన్టీఆర్ 101వ జయంతి ఈరోజు(మంగళవారం). సినీ ప్రస్థానంలో ఆయనకు తిరుగులేదు. ఆయన వేయని వేషం.. మెప్పించని క్యారెక్టర్ కూడా లేదు. ఇక, రాజకీయాల్లోకి వచ్చాక.. ఆయన మాట ప్రభంజనం.. ఆయన ఒక్క పిలుపు ఇస్తే.. గ్రామాలకు గ్రామాలు కదిలి వచ్చేవి. అంత పవర్ ఫుల్‌గా అన్నగారి `పిలుపు` ఉండేది. ఆయన సృష్టించిన ప్రభజనం ఇప్పటికీ మనకువినిపిస్తూనే ఉంటుంది. ఇటీవల ఏపీ ఎన్నికల్లోనూ.. టీడీపీ అధినేత అప్పటి `పిలుపుపదాలనే` వాడుకున్నారు.
`రా.. కదలిరా!` పేరుతో చంద్రబాబు సభలు, సమావేశాలు కూడా పెట్టారు. వాస్తవానికి.. ఇలాంటివి ఎన్నో నాడు 1983-84 మధ్య అన్నగారు ఎన్టీఆర్ నోటి నుంచి అలవోకగా వచ్చాయి. “నింగి వంగిందా.. నేల ఈనిందా“ అన్నది బాగా ప్రాచుర్యంలో ఉన్న అన్నగారి మాట.ఇదొక్కటే కాదు.. తెలుగువారికి `అన్న`గా మారిన ఎన్టీఆర్.. `తెలుగుజాతి ఆత్మ గౌరవం` వంటి డైలాగులు పేల్చిన అన్నగారి వెనుక.. మరో మనిషి ఉన్నారు. ఈ విషయం ఎక్కడా ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, వాస్తవం. ఆయనే.. తెలుగువారి అందల రవళి.. విఖ్యాత కవి.. కళా ప్రపూర్ణ సింగిరెడ్డి నారాయణరెడ్డి.
అటు ఎన్టీఆర్.. కృష్ణాజిల్లాకు చెందినవారు. ఇటు నారాయణ రెడ్డి తెలంగాణలోని కరీంనగర్‌కు చెందినవారు. కానీ, సినీ రంగంలో ప్రత్యక్షంగా కలిసి ప్రయాణం చేసిన.. ఈ ఇరువురూ.. కూడా రాజకీయాల్లో పరోక్షంగా కలిసి ముందుకు నడిచారు. సినీ రంగంలో తొలిసారి.. నారాయణ రెడ్డిని పరిచయం చేసింది.. అన్నగారే. ఎన్టీఆర్ సినిమా.. గులేబకావళి కథలో సినారే రాసిన.. “నన్ను దోచుకొందువటే“ పాట సూపర్ ఎవర్గ్రీన్ హిట్టనే విషయం తెలిసిందే. వాస్తవానికి అప్పటికి సినారేకు ఎవరూ అవకాశం ఇవ్వలేదు. కానీ, ఆయన ప్రతిభను గుర్తించిన అన్నగారు.. ఎన్ ఏటీ కంబైన్స్ నిర్మాణంలో వచ్చిన గులేబకావళి సినిమాలో ఫస్ట్ చాన్స్ ఇచ్చారు.
ఇలా మొదలైన అన్నగారు-సినారేల ప్రయాణం.. రాజకీయంగా కూడా.. ముందుకు సాగింది. అయితే.. సినారే ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. కేవలం తెరచాటున ఉండి.. అన్నగారికి రచయితగా అందించాల్సిన సాయం చేశారు. ఆయన కలం నుంచి జాలువారినవే.. `రా.. కదలిరా!` `తెలుగు వారి ఆత్మగౌరవం..` `తెలుగు జాతి పిలుస్తోంది`, `అన్న` వంటి అనేక పదాలు ఉన్నాయి.
“కార్మికుడి చెమట నుంచి
కర్షకుడి రక్తం నుంచి
తాడిత పీడిత ప్రజల బాధల నుంచి పుట్టింది తెలుగు దేశం“
– ఇలాంటి ఎన్నో గంభీరమైన వాక్యాలు.. పదాలు తెరవెనుక ఉండి రాసిచ్చింది సి.నారాయణరెడ్డిగారే. నిజానికి అన్నగారే మాటల రచయిత. అయితే.. రాజకీయంగా ఆయన దూకుడును మరింత పెంచింది.. ప్రజలకు చేరువ చేసింది మాత్రం నారాయణరెడ్డి కలం అనడంలో సందేహం లేదు. చిత్రం ఏంటంటే.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ నిర్వహించే `మహానాడు` గురించి అందరికీ తెలిసిందే. అయితే.. ఈ పేరుఎలా వచ్చిందో తెలుసా? తొలి సారి నిర్వహించిన వేడుకలకు ఏం పేరు పెట్టాలనే చర్చ తెరమీదికి వచ్చింది. ఎంతకీ తెగలేదు. దీంతో సినారేకు ఫోన్ చేసిన ఎన్టీఆర్.. “మీ అభిప్రాయం ఏంటి“ అన్నారు. “మహానటుడు పుట్టిన రోజు కాబట్టి.. “ అని ఇంకా పూర్తి చేయకుండా.. “అర్ధమైంది“ అంటూ అన్నగారు ఫోన్ పెట్టేశారు. `ఆ మహా` నే తర్వాత.. మహానాడు అయింది!!