కాపు ఉద్యమ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ సోకింది. ఈ విషయాన్ని ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి వెల్లడించారు. ఈ సందర్భంగా క్రాంతి కొన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. కొద్ది రోజుల నుంచి క్యాన్సర్ తో పోరాడుతున్న ముద్రగడకు ఆయన కుమారుడు గిరి సరైన్ ట్రీట్‌మెంట్ అందించడం లేదని క్రాంతి ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూడడానికి కిర్లంపూడి వెళితే తన సోదరుడు గిరి, అతడి మామ తనను అడ్డుకున్నారని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్గ పోస్ట్ పెట్టారు. `నా తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో పోరాడుతున్నారు, నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా ఆయనకు అత్యవసరంగా అవసరమైన చికిత్సను అందించేందుకు నిరాకరిస్తున్నాడని తెలిసి నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. ఇటీవల మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఒకరు నన్ను మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ గిరి మరియు అతని మామగారు నా తండ్రిని కలవడానికి అనుమతించలేదు.
నా తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు. దగ్గరి బంధువులకు లేదా ఆయన దీర్ఘకాల అనుచరులకు కూడా ఏమీ తెలపడం లేదు. గిరి మరియు అతని అత్తమామల సన్నిహితులు మా నాన్నను నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని.. ఆయన్ను కలిసేందుకు, ఆయనతో మాట్లాడటానికి ఎవరినీ అనుమతించడం లేదని నేను తెలుసుకున్నాను. గిరి ఇది నిజంగా అమానుషం, ఆమోదయోగ్యం కాదు. మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తుంటే, నేను ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి.. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మా నాన్న గౌరవం, పారదర్శకత మరియు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణకు అర్హుడు.` అంటూ క్రాంతి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈమె ట్వీట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.