ఒక గెలుపు మరో గెలుపునకు కారణం అయితే అదేమంత పెద్ద విషయం కాదు. కానీ.. తొలి అడుగులోనే ఎదురుదెబ్బ తగిలి.. దాని నుంచి కోలుకొని అసమాన విజయాన్ని సాధించటంలోనే కిక్ ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు తాజా మిస్ వరల్డ్ సుచాత చువాంగ్ శ్రీ. మిస్ థాయిలాండ్ గా కిరీటాన్ని సొంతం చేసుకొని ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్న ఆమె.. 107 మంది సుందరాంగుల్ని దాటేసి.. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకొని రికార్డు క్రియేట్ చేవారు.
అందంతోనే కాదు అభినయం.. ప్రతిభతో పాటు ఆమె లక్ష్యం.. ఆమె పని చేస్తున్న సామాజిక అంశం ఆమెను ప్రపంచ సుందరి కిరీటం సొంతమయ్యేలా చేశాయని చెప్పాలి. 72వ మిస్ వరల్డ్ 2025 విజేతగా నిలిచిన ఆమె నేపథ్యాన్ని చూస్తే.. ఆశ్చర్యపోకుండా ఉండలేరు. కారణం.. 2021లో జరిగిన ‘మిస్ రత్నకోసిన్’ (థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని పురాతన నగరంగా దీన్ని చెబుతారు. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే బ్యాంకాక్ ఓల్డ్ సిటీగా దీన్ని చెప్పొచ్చు) పోటీల్లో పాల్గొన్న సుచాత.. ఆడిషన్స్ దశను దాటలేదు.
ఈ పోటీల్లో ఆడిషన్స్ నుంచే ఆమెను ఎలిమినేట్ చేశారు. అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో ప్రయత్నించింది. ఆ తర్వాతి సంవత్సరం 2022లో తన పద్దెనిమిదో ఏట మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీల్లో పాల్గొన్న ఆమె.. రెండో రన్నరప్ గా నిలిచారు. దీంతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. 2024లో మిస్ యూనివర్స్ థాయ్ ల్యాండ్ పోటీల్లో పాల్గొన్న ఆమె విజేతగా నిలవటమే కాదు.. మిస్ ఛార్మింగ్ టాలెంట్.. మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ లాంటి సబ్ టైటిళ్లను సొంతం చేసుకున్నారు.
థాయ్ లాండ్ లోని పుకెట్ లో పుట్టి పెరిగిన సుచిత్ర.. బ్యాంకాక్ లో తన స్కూలింగ్ చేశారు. థాయ్.. ఇంగ్లిష్.. చైనీస్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆమె.. వివిధ దేశాల కల్చర్ మీదా.. సంప్రదాయాల మీద మక్కువ ఎక్కువ. ప్రస్తుతం థమ్మసాట్ వర్సిటీలో పొలిటిల్ సైన్స్ స్టూడెంట్ అయిన ఆమె.. మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అందాల పోటీల్లో పాల్గొనటంలోనూ ఆసక్తి ఎక్కువ. అదే ఆమెను.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే చేసింది.
ఇదంతా ఆమె జీవితంలోని ఒక కోణం. అందుకు భిన్నమైన కోణం మరొకటి ఉంది. వ్యాపార కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సుచాతకు పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు రొమ్ములో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. మొదట్లో దానిని క్యాన్సర్ కణితిగా భావించారు. అయితే.. అది క్యాన్సర్ కాదని.. పెద్ద ప్రమాదం లేదని తేలటంతో పెద్ద గండం నుంచి ఆమె గట్టెక్కారు. అయితే.. ఆ కణితి తర్వాతి రోజుల్లో క్యాన్సర్ గా మారకుండా ఉండేందుకు దానిని తొలగించారు. ఈ సమయంలోనే ఆమెకు.. క్యాన్సర్ తో బాధ పడే వారి మీద మదనం మొదలైంది.
అదే ఆమెను క్యాన్సర్ మీద అవగాహన పెంచేలా చేసింది. దీంతో.. తన చుట్టూ ఉన్న వారికి క్యాన్సర్ మీద అవగాహన పెంచటం.. తొలిదశలోనే దాన్ని గుర్తించే తీరు.. లాంటి అంశాల మీద ఆమె పని చేయటం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆమె ఒక ప్రాజెక్టు షురూ చేశారు. క్యాన్సర్ బాధితులకు అండగా నిలవటం.. వారికి దన్నుగా నిలిచేందుకు అవసరమైన నిధుల్ని సేకరించటం.. కొన్ని సంస్థలతో కలిసి పని చేయటం లాంటివి ఆమె చేస్తున్నారు. ఇదంతా చూస్తే.. ఆమె బాహ్యరూపమే కాదు.. అంతర్ రూపం కూడా ఎంతో అందమైనదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇదంతా చదివిన తర్వాత మిస్ వరల్డ్ టైటిల్ విజేతకు అవసరమైన అన్ని అర్హతలు ఆమెకు ఉన్నట్లుగా అనిపించక మానదు.