సోషల్ మీడియా ఊపందుకున్నాక అక్కడ ఫ్యాన్ వార్స్ ఎంత తీవ్ర స్థాయికి చేరాయో తెలిసిందే. గతంలో స్టార్ హీరోల సినిమాలు రిలీజైనపుడు థియేటర్ల దగ్గరో.. వేరే వేదికల్లోనో గొడవలు జరిగేవంతే. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని రోజూ ఏదో ఒక టాపిక్ వెతుక్కుని మరీ గొడవ పడుతున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో తరచుగా ఇలా గొడవ పడే బ్యాచుల్లో నందమూరి, మెగా అభిమానులు ఉంటారు. ఒక వర్గం హీరో సినిమా రిలీజైనపుడు అవతలి వర్గం రెచ్చిపోతుంటుంది.
అవతలి వర్గం ఇలాంటి సందర్భమే చూసుకుని బదులు తీర్చుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కాక సమయం సందర్భం లేకుండా టాపిక్ సృష్టించుకుని గొడవపడడమూ మామూలే. ఇప్పుడు నందమూరి, మెగా అభిమానులు విచిత్రమైన అంశాల మీద తీవ్ర స్థాయిలో గొడవలు పడుతున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ ఆహార అలవాట్ల మీద ఇటీవల కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఒకేసారి నలభై మిరపకాయ భజ్జీలు తీని నీళ్లు తాగి బ్రేవ్‌మనే వాడని ఒకాయన వ్యాఖ్యానిస్తే.. మరొకరు ఆయన తెల్లవారుజామున రెండు కిలోల నాటుకోడి తినేవారని పేర్కొన్నారు. కౌంజుపిట్ట మాంసం రెండు కిలోలు లాగించేవారని.. 20 సోడాలు తాగేవారని.. ఇలా రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులు చెప్పిన మాటల్ని పట్టుకుని ఆ వీడియోలను వైరల్ చేస్తూ మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు.
మరోవైపు చిరంజీవి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో విజయశాంతి పక్కన ఉండగా చేసిన వ్యాఖ్యలు, పాడిన పాట.. ఈ వీడియోలను పట్టుకుని అవతలి వర్గం విపరీతంగా ట్రోల్ చేస్తోంది. ఇవేవీ ఇప్పుడు జరిగిన విషయాలు కాకపోయినా.. ట్రోల్ చేయడానికి అవి ఉపయోగపడుతున్నాయి. ఎవ్వరూ తగ్గేదే లేదన్నట్లు రెచ్చిపోయి అవతలి హీరోల మీద విషం కక్కుతున్నారు. ఈ ఫ్యాన్ వార్స్ ఇంకా ఎంత తీవ్ర స్థాయికి చేరతాయో అనే ఆందోళన సినీ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.