జగనన్న విడిచిన బాణం వచ్చేస్తుంది..!

పోటీ చేయడం తొలిసారే అయినా గత ఎన్నికల్లో వైసీపీ బాగా ప్రభావం చూపింది. దాదాపు అధికార టీడీపీతో సమానంగా ఓట్ల శాతం సంపాదించుకోగలిగింది. అయితే చంద్రబాబు అనుభవానికే జై కొట్టిన ఆంధ్రా ప్రజలు ఆయననే సీఎం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ సీన్ రిపీట్ కాకూడదని ప్రతిపక్ష వైసీపీ భావిస్తోంది. అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రధానంగా పోటీలో నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. కేవలం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్న ఆ పార్టీ అధిష్టానం అందుకోసం పలు రకాల సర్వేలు చేయించింది. అంతేకాదు, అన్ని రంగాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న వారిని వెదికి పట్టుకుని వారికి వైసీపీ టికెట్లు ఇవ్వాలని చూస్తోంది. ఇందులో భాగంగా తన చెల్లెలు, జగనన్న విడిచిన బాణాన్ని అని చెప్పుకునే షర్మిలను ఎన్నికల బరిలో ఉంచాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడట. ఈ వార్త ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో నూతనుత్తేజాన్ని నింపుతోంది.

అవినీతి ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ జైలుకెళ్లినప్పుడు ఆ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు వైఎస్ షర్మిల. రాజన్న కూతురిని, జగనన్న విడిచిన బాణాన్ని అంటూ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 14 జిల్లాల్లో 3000వేల పైచిలుకు కిలో మీటర్లు ఆమె యాత్ర చేశారు. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక దూరం పాదయాత్ర చేసిన మహిళగా రికార్డులకెక్కారు. ఇదంతా పక్కన పెడితే, వైఎస్ షర్మిల.. వచ్చే ఎన్నికల్లో ఆమెను పోటీకి నిలబెట్టాలని జగన్ భావిస్తున్నాడట. షర్మిల ఎంపీగా పోటీ చేస్తారనే మాట వినిపిస్తోంది. షర్మిలకు తగిన నియోజకవర్గాన్ని అన్వేషించే పనిలో ఉన్నారట జగన్ మోహన్ రెడ్డి. విశాఖపట్టణం, ఒంగోలు, రాయలసీమలోని పలు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో విశాఖలో జగన్ తల్లి విజయమ్మ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వైసీపీ ధృవీకరించకపోయినప్పటికీ, ఆమె పోటీ చేయడం ఖాయమేనన్న ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.