వైఎస్ శిష్యుడికి టీడీపీ ఎంపీ సీటు

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతుందట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుటున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురు కాబోతుందట. ఉమ్మడి ఏపీకి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ప్రియ శిష్యుడైన ఓ కీలక నేత టీడీపీలో చేరబోతున్నారట. వైఎస్సార్ తనయుడు జగన్‌మోహన్‌ రెడ్డి గురించి అన్నీ తెలిసిన ఆ నేత చేరికతో టీడీపీ మరింత బలోపేతం అవబోతుందట. అంతేకాదు జగన్ మైనస్‌ల గురించి పూర్తిగా తెలిసిన ఆ నేతకు టీడీపీ నుంచి ఎంపీ టికెట్ కూడా ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆయన ఎవరనేగా మీ సందేహం..? ఆయనే విశాఖపట్నం మాజీ మేయర్‌, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి.

సబ్బం హరి తెలుగుదేశం పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. దీని గురించి గతంలో ప్రచారం కూడా జోరుగా జరిగింది. ఆయన నోరు మెదపకపోవడంతో ఈ ప్రచారానికి బ్రేక్ పడింది. అయితే, నవ్యాంధ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబే రాష్ట్రానికి పెద్ద దిక్కని ఆయన ఇటీవల పలుసార్లు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆయన మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న సబ్బం హరి ప్రస్తుతం ఏ పార్టీలోనూ కొనసాగడంలేదు. కొద్దిరోజులుగా మాత్రం టీడీపీలో చేరాలని ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఆయన చేరికకు టీడీపీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్ వచ్చిందట. దీంతో ఆయన కొద్దిరోజుల్లో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారట.

టీడీపీలోకి వచ్చేందుకు వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానానికి గానీ, విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానానికి గానీ పోటీ చేసే అవకాశం కల్పించాలని సబ్బం హరి అధిష్టానాన్ని కోరారట. దీనికి అధిష్టానం కూడా ఓకే చెప్పేసిందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఇప్పుడు అనకాపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్‌కు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం కేటాయిస్తారని, భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌కు వేరే నియోజకవర్గం కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అవంతి కూడా తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, అది కూడా భీమిలి నియోజకవర్గమే కావాలని ఇటీవల ఆయన ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.

మరోవైపు గంటా శ్రీనివాస్ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉందని చెప్పాలి. ఇటీవల టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ చానెల్ నిర్వహించిన సర్వేలో ఆయన ఓడిపోతారని ఫలితం వచ్చింది. దీంతో మనస్థాపం చెందిన గంటా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ, చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో ఆయన అలక వీడారు. సబ్బం హరి విషయానికొస్తే.. ఆయన వైఎస్సార్‌కు వీరాభిమాని. ఆయన హయాంలోనే విశాఖ మేయర్ అయ్యారు. కానీ ఉన్నట్లుండి పార్టీకి దూరమయ్యారు. కొద్దిరోజులకు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి ప్రజారాజ్యం అభ్యర్ధి అల్లు అరవింద్‌పై గెలిచి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత తమ పార్టీపైనే అవిశ్వాసం ప్రకటించి కాంగ్రెస్ పార్టీ బహిష్కరణకు గురయ్యారు. విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరి ఓడిపోయారు. అప్పటి నుంచి ఏ పార్టీలోనూ చేరని సబ్బం హరి.. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లబోతున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.