బీజేపీకి షాకివ్వనున్న నిరుద్యోగులు?

నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఆ హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదనే వాదన వినిపిస్తుంటుంది. ఈనేపధ్యంలో నిరుద్యోగులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే హామీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ హామీలు నెరవేరకపోవడంతో యువత అసంతృప్తితో కొట్టుమిట్టాడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయానికి గండిపడుతుందనే విమర్శలు ఎదురువుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ ఓటర్లు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన ‘తీర్పు’ చెప్పనున్నారని తెలుస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో 20 నుంచి 29ఏళ్ల మధ్యవయసు కలిగిన యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో 30శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 26శాతం, రాజస్థాన్‌ 55శాతం మేరకు నిరుద్యోగ సమస్య తాండవిస్తున్నట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ వెల్లడించింది. దీనిలో పేర్కొన్న ప్రకారం డిగ్రీ పూర్తిచేసిన యువతకూ ఉద్యోగాలు లేవని తెలుస్తోంది. పైగా ఈ మూడు రాష్ట్రాల్లోని మహిళల్లోనూ నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నట్టు తేలింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళల్లో నిరుద్యోగరేటు 8శాతం ఉంది.

అలాగే మధ్యప్రదేశ్‌లో 17శాతం, రాజస్థాన్‌లో 53శాతం నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లోని మొత్తం 5.22లక్షల యువత నుంచి సేకరించిన సమాచారం మేరకు సీఎంఐఈ ఈ నివేదిక రూపొందించింది. కాగా, ఈ 3 రాష్ట్రాల్లోని ఓటర్లు.. నిరుద్యోగమే ప్రధాన సమస్యగా భావిస్తున్నట్టు వెల్లడైంది. అలాగే ధరల పెరుగుదలను మరో ప్రధాన సమస్యగా ఓటర్లు గుర్తించారని సర్వేలో వెల్లడైంది. ఈ రెండు సమస్యలే ముఖ్యమైనవివిగా భావిస్తున్నవారు రాజస్థాన్‌లో 43శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 40శాతం, మధ్యప్రదేశ్‌లో 41శాతంగా ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. దీనికితోడు గత మేలో విడుదలయిన మూడ్‌ ఆఫ్‌ నేషన్‌ సర్వేలోనూ ప్రజలు నిరుద్యోగం, పేదరికాన్ని ప్రధాన సమస్యలుగా గుర్తించారని భోగట్టా. ఉపాధి అవకాశాలు మృగ్యం కావడంతో ఈ మూడు రాష్ట్రాల్లోని యువత బీజేపీ ప్రభుత్వాలను నిలదీస్తోంది. 2014 ఎన్నికల్లో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీనిచ్చిన విషయం విదితమే. కాగా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఈ సమస్యకు బీజేపీ ఈనాటికీ పరిష్కారం చూపలేదనే వాదన వినిపిస్తోంది. పైగా ప్రయివేటీకరణ, ప్రాజెక్టుల పేరిట భూముల స్వాధీనంలాంటి నిర్ణయాలతో బీజేపీ ప్రభుత్వాలు మరింత చిక్కుల్లో పడ్డాయనే విశ్లేషణ ఉంది. ఈ నేపధ్యంలో యువత బీజేపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.