ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్న యంగ్ ఎంపీ

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడి రాజకీయం రంజుగా సాగుతోంది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తును ఇప్పటికే మొదలుపెట్టగా, ప్రతిపక్షాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల్లోని ఆశావాహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అన్ని పార్టీలతో పోల్చుకుంటే టీఆర్ఎస్ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరిట ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో ఇప్పుడు ఆ పార్టీలో హౌస్‌ఫుల్ అయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఒక్కో స్థానంలో ముగ్గురు, నలుగురేసి నేతలు పోటీ పడుతుండడంతో ఆ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం గతంలో ఆయన సర్వే చేసిన ఫలితాల ఆధారంగా టికెట్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల అభ్యర్ధులను మార్చబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ఓ వార్త తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ ఈసారి మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ జి.వివేకానంద్‌ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ రెండు విషయాలపై సీఎం కేసీఆర్‌ ఇద్దరికీ స్పష్టత ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెప్టెంబరు 2న జరగనున్న ప్రగతి నివేదన సభ కోసం మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశాలకు ఎంపీ సుమన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. బెల్లంపల్లిలో ప్రస్తుత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మళ్లీ పోటీ చేస్తారని, తాను చెన్నూర్‌ నియోజకవర్గ పరిధిలోని నాగ్‌పూర్‌-హైదరాబాద్‌ రహదారి పక్కన ఉండే గద్దరాగడి గ్రామం వద్ద ఇల్లు నిర్మించుకొని ఉంటానని ప్రకటించారు. దీంతో ఈ వార్త నిజమేనన్న ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూర్‌ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. ఇందులో బెల్లంపల్లి నుంచి చిన్నయ్యకు టికెట్‌ ఖరారైతే మిగిలేది చెన్నూరే కావడంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు చెన్నూర్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే అక్కడ తనకే టికెట్‌ ఇస్తారని చెప్పుకొంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.