9 గంట‌ల‌కు ప్ర‌మాణ‌స్వీకారం..యెడ్డీదే పీఠం

కర్ణాటక రాజకీయం కీలకమలుపు తిరిగింది. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించారు. 104 సీట్లు సాధించి, మెజారిటీకి 8సీట్ల తక్కువ దూరంలో నిలిచిపోయిన బీజేపీకి తన బలాన్ని నిరూపించుకునేందుకు పక్షంరోజుల గడువు ఇస్తున్నట్లు రాజ్‌భవన్‌ ప్రకటించింది. ‘ప్రభుత్వ ఏర్పాటుకు, కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మిమల్ని ఆహ్వానిస్తున్నాను’ అని గవర్నర్‌ యడ్యూరప్పకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో బీజేపీ నేత బూకనకెరె సిద్దలింగప్ప యడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు!! ఉదయం తొమ్మిది గంటలకు ప్రమాణస్వీకారోత్సవం జరుగనుండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం!!.
ఇదిలాఉండ‌గా…గవర్నర్‌ వజూభాయ్‌ వాలా నిర్ణయంపై జేడీఎస్‌-కాంగ్రెస్‌ మండిపడ్డాయి. తగినంత సంఖ్యాబలం లేకపోయినా బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం చట్ట విరుద్ధమని కాంగ్రెస్‌ నేత చిదంబరం చెప్పారు. మారిన పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ దృష్టిపెట్టింది. గవర్నర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం రాజ్‌భవన్‌ వద్ద ధర్నా చేయాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ భావిస్తున్నాయి. అవసరమైతే మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతిని కలువాలని, సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ బీజేపీ మ్యాజిక్‌ సంఖ్య 112ను అందుకోలేకపోయింది. దీంతో బీజేపీని అధికారంలోకి రాకుండా నివారించేందుకు కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా జేడీఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తూనే, ఇతర పార్టీల నుంచి లాగేందుకు బేరసారాలు మొదలుపెట్టాయి. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతున్నదని, రూ.100కోట్లు, మంత్రిపదవి ఇస్తామంటూ ఎర వేస్తున్నదని జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ఆరోపించడంతో కలకలం మొదలైంది. దీనికితోడు కాంగ్రెస్‌, జేడీఎస్‌ శానసపక్ష సమావేశాలకు పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో  అన్ని పార్టీలూ గవర్నర్‌ను కలిసేందుకు పోటాపోటీగా ప్రయత్నించడంతో రాజ్‌భవన్‌ చుట్టూ రాజకీయ హైడ్రామా సాగింది. 
బుధవారం రోజంతా హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం బీజేపీ, జేడీఎస్‌, కాంగ్రెస్‌ విడివిడిగా శానససభాపక్ష సమావేశాల్ని నిర్వహించాయి. బీజేపీ ఎమ్మెల్యేలు యడ్యూరప్పను, జేడీఎస్‌ నేతలు కుమారస్వామిని ఆయా పార్టీల శాసనసభాపక్ష నేతలుగా ఎన్నుకున్నారు. అయితే కాంగ్రెస్‌ సమావేశానికి 12మంది, జేడీఎస్‌ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు చేయిదాటిపోతాయేమోనని భావించిన జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి. అదేసమయంలో యడ్యూరప్ప గురువారం ప్రమాణస్వీకారం చేస్తారంటూ వార్తలు రావడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ మండిపడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ తమను అనుమతించకపోతే ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి సిద్ధమైంది. తమ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో జేడీఎస్‌ నేత కుమారస్వామి, కర్ణాటక పీసీసీ చీఫ్‌ పరమేశ్వర రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అయితే సిబ్బంది నేతలను లోపలికి అనుమతించలేదు. దీంతో కుమారస్వామి, పరమేశ్వర, ఎమ్మెల్యేలు గేటు బయటే ఉండిపోయారు. అయితే రాజ్‌భవన్‌ వద్ద కాసేపు హైడ్రామా అనంతరం జేడీఎస్‌-కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ లభించింది.
జేడీఎస్‌ అధినేత కుమారస్వామి, కర్ణాటక అధ్యక్షుడు పరమేశ్వర, కాంగ్రెస్‌ నేతలు శివకుమార్‌, వీరప్ప మొయిలీలు గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలమున్నందున తమకు అవకాశమివ్వాలని గవర్నర్‌ను కోరినట్లు వారు చెప్పారు. తమకు 118మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఈ సంఖ్యాబలం నిరూపించేందుకు వీలుగా అవసరమైన డాక్యుమెంట్లను గవర్నర్‌కు సమర్పించామని తెలిపారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తాము ప్రభుతాన్ని ఏర్పాటు చేసేలా అనుమతించాలని కోరుతూ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌ను కలిశారు. బీజేపీ లెజిస్లేచర్‌ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, అనంతకుమార్‌లతో కలిసి యడ్యూరప్ప నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. తమకు తగినంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలిపారు. త్వరలోనే గవర్నర్‌న నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు యడ్యూరప్ప మీడియాకు తెలిపారు. కాంగ్రెస్‌తో చేతులు కలుపడంపై జేడీఎస్‌ ఎమ్మెల్యేలు పలువురు అసంతృప్తితో ఉన్నారని ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి ఆర్‌.శంకర్‌ ఇప్పటికే బీజేపీకి తన మద్దతు ప్రకటిస్తూ రాతపూర్వకంగా వెల్లడించారు. దీంతో బీజేపీ సభ్యుల సంఖ్య 105కు చేరింది.
కర్ణాటకలో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్న తరుణంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశానికి కొత్తగా ఎన్నికైన 78మంది ఎమ్మెల్యేలకుగాను 66మంది మాత్రమే హాజరుకావడం కలకలం రేపింది. 12మంది ఎమ్మెల్యేలు ఎందుకు గైర్హాజరు అయ్యారనే విషయమై రకరకాల ప్రచారాలు కొనసాగుతున్నాయి. వీరిలో 9మంది వివిధ కారణాలతో సమావేశానికి హాజరుకాలేదని తెలిపినట్లు సమాచారం. కానీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజశేఖరపాటిల్‌, నరేంద్ర, ఆనంద్‌సింగ్‌ మాత్రం ఆ పార్టీ నేతలకు సాయంత్రం వరకూ అందుబాటులోకి రాలేదని తెలుస్తున్నది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన గాలి సోమశేఖర్‌రెడ్డి, గాలి కరుణాకర్‌రెడ్డి సోదరులకు సన్నిహితులు, ఐరన్‌ ఓర్‌ అక్రమ తరలింపు కేసులో గాలిజనార్దన్‌రెడ్డితో ఆనంద్‌సింగ్‌ కూడా గతంలో అరెస్టయ్యారు. దీంతో వీరు బీజేపీ గూటికి వెళ్లి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఎమ్మెల్యేలంతా  తమ వెంటే ఉన్నారని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ తెలిపారు. ఎమ్మెల్యేలను కాపాడుకునే విషయంలో తమ వ్యూహాలు తమకు ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే జేడీఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజవెంకటప్ప నాయక, వెంకట్‌రావు నాదగౌడ కూడా కనిపించకుండా పోయినట్లు సమాచారం. బెంగళూరులోని ఓ హోటల్‌లో జరిగిన జేడీఎస్‌ శాసనసభాపక్ష సమావేశానికి  ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం గమనార్హం.  అయితే వారంతా తమ వెంటే ఉన్నారని కుమారస్వామి ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు సంప్రదించినట్లు ఆయన వెల్లడించారు. తనను కూడా బీజేపీ సంప్రదించిందని మరో కాంగ్రెస్‌ నేత తెలిపారు. 
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్‌ ఆహ్వానించారని, నేడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని పేర్కొంటూ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ నిర్ణయానికి ముందే ప్రకటించడం కలకలం రేపింది. యడ్యూరప్ప గురువారం ఉదయం 9.30గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని రాజాజీనగర్‌ ఎమ్మెల్యే సురేశ్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.  గవర్నర్‌ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాకముందే బీజేపీ ఎమ్మెల్యే ఈ ట్వీట్‌ చేయడం కలకలం రేపింది. అయితే కొద్దిసేపటికే సురేశ్‌ కుమార్‌ తన ట్వీట్‌ను తొలిగించారు. మరో ఎమ్మెల్యే మురుగేశ్‌ నిరానీ కూడా యడ్యూరప్ప గురువారం ప్రమాణస్వీకారం చేస్తారని, త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం రాజ్‌భవన్‌ నుంచి వెలువడుతుందని ముందే వెల్లడించడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.