వైసీపీ సేఫ్ గేమ్.. బట్ నో యూజ్

దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నిక కాస్తా ఓటింగ్ వరకు వెళ్లడంతో అధికార, ప్రతిపక్షాలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక కోసం పార్టీలన్నీ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాయి. అయితే, విపక్షాలను ఏకం చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఓడిపోక తప్పలేదు. ఈ ఎన్నిక విషయంలో కొన్ని పార్టీలు అనుసరించిన విధానం ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఓటింగ్‌కు గైర్హాజరవడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఏపీ సమస్యల కోసం దేశ రాజధానిలో తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతున్న సమయంలో రాష్ట్రానికి చెందిన పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు కొద్ది సమయం ముందు వరకు బీజేపీ వ్యతిరేక కూటమికే ఓటు వేస్తామని ప్రకటించిన వైసీపీ.. తర్వాత మాట మార్చింది. అప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించిన వైసీపీ తర్వాత యూ టర్న్ తీసుకుంది. ఎన్నికకు గైర్హాజరవుతున్నట్లు ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

ప్రస్తుతం జరుగుతున్న వర్షకాల సమావేశాల్లో పాల్గొంటున్న విజయసాయిరెడ్డి.. ఈ ఎన్నికకు నోటిఫికేషన్ వెలవడినప్పటి నుంచి బీజేపీ వ్యతిరేక పక్షానికి ఓటేస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటింగ్ సమయానికి ముందు పూర్తిగా మాట మార్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారనే కారణంగానే తాము ఓటు వేయడం లేదని చెప్పుకొచ్చారు. విపక్షాల సమావేశంలో ఇతర పార్టీల అభ్యర్థిని నిలబెడతామని చెప్పారని, తర్వాత మాట మార్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే రంగంలోకి దించారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఏపీకి కాంగ్రెస్, బీజేపీ రెండూ అన్యాయం చేశాయని… అందుకే ఎవరికీ ఓటు వేయబోమన్నారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి.. కాంగ్రెస్ తరపున హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కూడా బీజేపీకి వ్యతిరేక పక్షానికే ఓటు వేస్తామని ప్రకటించారు. కానీ, ఓటు వేయకుండా నిర్ణయం తీసుకుని సేఫ్ గేమ్ ఆడింది వైసీపీ. ఈ మధ్య బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న ఆ పార్టీ నేతలు.. వ్యతిరేకంగా ఓటు వేస్తే తమ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని భావించే, వారు ఓటింగ్‌కు గైర్హాజరై ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీని ఇబ్బంది పెట్టాలనుకుని, వైసీపీ మరోసారి ఇరకున పడినట్లైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.