వాళ్లను టీడీపీకి దూరం చేయాలని వైసీపీ ప్లాన్

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో సారి అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ.. ఈ సారి ఎలాగైనా మెజారిటీ స్థానాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ఇప్పటి నుంచే గ్రామ స్థాయి నుంచి ఎన్నికల వేడి రాజుకుంది. గత ఎన్నికల తర్వాత వైసీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా.. ఆ పార్టీ మాత్రం కృంగిపోలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయబావుటా ఎగురవేయాలనుకుంటున్న ఆ పార్టీ.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడు కేంద్రంతో జరుపుతున్న పోరాటానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. దీంతో రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగిపోతోంది. పలు సర్వేల్లో కూడా ఇది తేలింది. అయినా ఏమాత్రం ధీమా వ్యక్తం చేయకుండా ఆ పార్టీ అధిష్టానం రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతోంది.

గత ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉన్న ముస్లిం, మైనారిటీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. దీనితో పాటు వైసీపీకి చెందిన ముస్లిం ఎమ్మెల్యేలు, నాయకులు కూడా టీడీపీలోకి రావడంతో ఆ సామాజికవర్గం కూడా ఇటు వైపు మళ్లింది. దీనికి ఇటీవల నిర్వహించిన ‘నారా హమారా… టీడీపీ హమారా’ బహిరంగ సభే ఉదాహరణ. ముస్లింలు-టీడీపీ కలిసి ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. దీని కోసం పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్టీలు తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో బస్సులు, వాహనాల్లో తరలిరావడంతో ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ లెక్క చేయకుండా మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం నడుచుకొంటూ సభా ప్రాంగణానికి చేరుకొని ఉత్సాహం ప్రదర్శించారు. వివిధ జిల్లాల నుంచి మేయర్లు, ముని సిపల్‌ చైర్‌పర్సన్‌లు, ఇతర నాయకులు కూడా ఎక్కువ సంఖ్యలో తరలివచ్చి సభకు నిండుదనం తీసుకొచ్చారు. ఇంత పెద్దఎత్తున ముస్లిం మైనార్టీ సభని నిర్వ హించడం ఇదే ప్రప్రథమమని సీఎం చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఇక గత ఎన్నికల్లో తమ వెంట నడిచిన ఈ సామాజిక వర్గాన్ని చేజేతులా దూరం చేసుకున్నామని భావిస్తున్న వైసీపీ.. వారిని మరోసారి దగ్గర చేసుకోవాలని భావిస్తోంది. దీని కోసం తమ పార్టీ మ్యానిఫెస్టోలో వారిపై వరాల జల్లు కురిపించాలని నిర్ణయించుకుందట. అలాగే ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన తరువాత ఆయన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ ఖాదర్‌బాషా తెలిపారు. నవంబరులో లక్ష మంది ముస్లిం మైనార్టీలతో గుంటూరు వేదికగా భారీ బహిరంగసభ నిర్వహిస్తామని చెప్పారు. ముస్లిం సమాజాన్ని మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు గుంటూరులో ‘నారా హమారా’ పేరుతో సభ నిర్వహించారని విమర్శించారు. మొన్నటి వరకూ బీజేపీతో దోస్తీ చేసి నేడు వైసీపీపై దుష్ప్రచారం చేయటం సిగ్గు చేటన్నారు. మరోవైపు వైసీపీ ప్రకటనను ముస్లిం, మైనారిటీలు లైట్ తీసుకుంటున్నట్లు సమాచారం. తామంతా కలిసికట్టుగా ఉన్నామని, అందరం చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సామాజికి వర్గానికి చెందిన ముఖ్య నేతలు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.