ఆ ఎమ్మెల్యే టీడీపీ జెండాను పది ముక్కలు చేస్తాడట

కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని.. వైసీపీలో కీలక నేత. ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న నాని.. ఆ పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోనే కీలక నేతగా మారిపోయాడు. జగన్ తర్వాత అంత రేంజ్ ఉన్న నేతల్లో ఆయన ఒకడిగా ఉంటున్నాడు. అధికార పార్టీ అయిన టీడీపీకి కృష్ణజిల్లా కంచుకోట లాంటిది. అలాంటి కృష్ణాజిల్లాలో కొడాలి నాని ఒక విధంగా ఒంటరి పోరాటమే చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ కారణంతోనే అతడికి జగన్ కూడా పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు. గతంలో ఏపీ ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కాడు. 200 రోజుల తర్వాత టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తానని, టీడీపీ జెండాను పది ముక్కలు చేస్తానని నాని ఫైర్ అయ్యాడు.

నెల రోజులుగా గుడివాడ మున్సిపాలిటీలో అవిశ్వాసం రచ్చ కొనసాగుతోంది. తమ పార్టీకి చెందిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అడపా బాబ్జీ అవిశ్వాసంపై టీడీపీ కౌన్సిలర్లు 16 మంది, తమ పార్టీ నుంచి చైర్మన్‌ యలవర్తితో వలస వెళ్లిన 12మంది కలిపి నాలుగో తేదీన సంతకాలు చేసి కలెక్టర్‌కు ఇచ్చారు. అయితే గత శనివారం జరిగిన విశ్వాస పరిక్షకు కోరం లేదని టీడీపీ నేతలు సమావేశాన్ని వాయిదా వేయించారు. దీంతో నెలరోజులుగా జరుగుతున్న అవిశ్వాసం రచ్చకు విసుగు చెందినని చెప్పుకుంటున్న కొడాలి నాని ‘‘నన్ను గుడివాడ నుంచి తరిమికొడతానంటున్న టీడీపీ నేతలకు రెండువందల రోజుల తర్వాత చుక్కలు చూపిస్తా… వారి రాజకీయ జీవితాలను భూస్థాపితం చేస్తా.. టీడీపీ జెండాను 10 ముక్కలుగా చించేస్తా’’ అంటూ రెచ్చిపోయాడు.

కొడాలి నాని టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యల సంగతేమిటో గానీ, ఆ పార్టీ జెండాపై చేసిన కామెంట్‌కు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వాస్తవానికి కొడాలి నాని దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఆ అభిమానంతోనే టీడీపీలో చేరారు. మరి, అలాంటప్పుడు టీడీపీ జెండాను ముక్కలు చేస్తానని కామెంట్ ఎందుకు చేశాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక బలమైన కారణమే ఉందట. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించేందుకు అక్కడ టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని, దీనితో పాటు నాని తమ పార్టీలో చేరుతాడని పుకార్లు పుట్టించి జగన్ దృష్టిలో విలన్‌ను చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని, అందుకే వారిపై కోపంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడని నాని సన్నిహితులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.