హరికృష్ణ పార్థివదేహం వెంటే వైసీపీ ఎమ్మెల్యే

నందమూరి కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వెళ్తుండగా నల్గొండ జిల్లా అన్నేపర్తి దగ్గర హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢికొట్టి, పల్టీలు కొడుతూ అవతలి రోడ్డుపై పడిపోయింది. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ఆయన కారులోంచి బయటకు పడిపోయారు. ఈ ప్రమాదంలో హరికృష్ణ తలకు, ఛాతీకి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి ఆయనను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరికృష్ణ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హరికృష్ణ మరణ వార్త విన్న వెంటనే ఆయన అభిమానులు ఎంతలా షాక్‌కు గురయ్యారో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా అంతే ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనే కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో ఒకరైన కొడాలి నాని.. హరికృష్ణ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం గుడివాడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి హరికృష్ణ ప్రమాద వార్తను విన్న వెంటనే షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన ఆయన చికిత్స పొందుతున్న నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉన్న నాని.. హరికృష్ణ పార్థీవదేహాన్ని హైదరాబాద్ తరలించే వరకు వెన్నంటే ఉన్నారు. హరికృష్ణ నివాసం వద్ద మృతదేహాన్ని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లతో కలిసి అంబులెన్స్ నుంచి కిందకు దించారు. స్వతహాగా సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కొడాలి నాని.. తెలుగుదేశం పార్టీలో చేరారు. నందమూరి కుటుంబంలో హరికృష్ణ, ఆయన కుమారుడు ఎన్టీఆర్‌ను అమితంగా ఇష్టపడే నాని.. వారితో సన్నిహితంగా మెలిగేవారు. టీడీపీని వీడి వైసీపీలో చేరినా వారి మధ్య సంబంధాలు చెడిపోలేదు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి హరికృష్ణ అని చెప్పిన కొడాలి నాని.. తనను కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించింది ఆయనేనని, హరికృష్ణ లేనిదే తనకు రాజకీయ జీవితం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. వేరు వేరు పార్టీలకు చెందిన వారైనా కూడా కష్టకాలంలో కొడాలి నాని నందమూరి కుటుంబానికి సహాయం చేయడం గొప్ప విషయమని ఫ్యాన్స్ అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.