మంత్రి ఉమకు స్పాట్.. కడప నుంచి మనుషులు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇదే విషయం చాలా సార్లు నిరూపణ అయింది.. అవుతోంది కూడా. సరిగ్గా దీనికి అచ్చుగుద్దినట్లు సరిపోయే మరో ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ తరహా ఘటనలు మైనస్‌గా మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.. జనసేన అధినేత పవన్‌పై వ్యక్తిగత దూషణకు దిగడం.. గతంలో చంద్రబాబును రోడ్డు మీద ఉరెయ్యాలి.. కాల్చేయాలి అని వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకి, జగన్‌కు ప్రతికూలంగా మారాయి. తాజాగా ఏపీ మంత్రికి స్పాట్ పెడతామంటూ ఓ మాజీ మంత్రి, వైసీపీ నేత మాట్లాడడం సంచలనంగా మారింది. ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరిస్తూ మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటకు రావడంతో కలకలం రేగింది. ఇప్పటికే వైసీపీ నేతల తీరుపై పలుమార్లు విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమ 2 దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికై మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల వైసీపీలో చేరిన వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణ ప్రసాద్‌.. ఆయనపై అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ ఫ్లెక్సీల వివాదం చినికి చినికి పెద్ద వివాదాలవుతున్నాయి. టీడీపీకి పట్టున్న గ్రామాలైన ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడిల్లో వైసీపీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. గుంటుపల్లిలో భారీగా ఫ్లెక్సీలు పెట్టింది. ప్రజలకు ఇబ్బందిగా ఉందనేకారణంగా పంచాయతీ సిబ్బంది రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించేందుకు నిర్ణయించారు. దీంతో వైసీపీ నేతలు పంచాయతీ సిబ్బందిపై గుర్రుగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని కృష్ణప్రసాద్‌కు, వసంత నాగేశ్వరరావుకు తెలియజేశారు. నాగేశ్వరరావు ఈ నెల 7 రాత్రి గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్‌.వి.నరసింహారావుకు ఫోన్‌చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

‘‘మావాడు కృష్ణప్రసాద్‌ తాడోపేడో అన్నట్లు ఉన్నాడు. అన్నిటికీ ప్రిపేరయ్యే ఉన్నాడు. గొడవలు జరిగితే.. అవసరమైతే మర్డర్లకు కూడా వెనకాడ కూడదనే లెక్కలో ఉన్నాడు. అవసరమైతే ఒకరిద్దరిని ఎటాక్‌ చేయడానికీ వెనకాడేది లేదు. (మంత్రి)ఉమాకి మావాడు ఎటాక్‌ ఇవ్వలేడని ఫీలింగ్‌ ఉంది. కానీ మావాడు అన్నిటికీ ప్రిపేరయ్యాడు. జగన్‌ కూడా సిద్ధంగానే ఉన్నాడు ఉమాని ఓడించాలని. అవసరమైతే కడప నుంచి కూడా బాగానే మనుషులను దించుతాడు. మావాడికి గుంటూరు-2 టిక్కెట్‌ ఇస్తాన ని ప్రత్తిపాటి పుల్లారావుతో చంద్రబాబు కబురుపెట్టాడు. అయినా సరే ఉమామీద పోటీ చేసి ఓడించాలనే ధ్యేయంతో ఇక్కడకు వచ్చాడు. జగన్‌ బెజవాడ పార్లమెంట్‌ సీటు ఇస్తానని ఆఫర్‌ చేశాడు. అయినా వెళ్లలేదు. ఉమా మీద పోటీచేయడం ధ్యేయమనే లెక్కలో దిగాడు. ఎంతైనా సరే ఏమైనా సరే అనే లెక్కలో దిగాడు. నేనైతే ఒక పద్ధతి కలిగిన వ్యవహారం చేస్తా. కృష్ణప్రసాద్‌ మొండి యవ్వారం చేస్తాడు’’ అని పంచాయతీ కార్యదర్శిని బెదిరించడంతో ఆయన ఫోన్ సంభాషణను తీసుకెళ్లి కేసు పెట్టాడు. ఈ వ్యవహారం సీఎం వరకు వెళ్లడంతో ఆయన కూడా దీనిపై సీరియస్‌గానే ఉన్నారు.

ఈ వ్యవహారం బయటకు రావడంతో వైసీపీ తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ వ్యక్తిత్వమే అలాంటిదని, బెదిరింపులకు పాల్పడడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని కామెంట్లు చేస్తున్నారు. గతంలో సీఎంపై, పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో జగన్‌కు చాలా వరకు ప్రతికూలత వచ్చింది. తాజా వ్యవహారంతో అది రెట్టింపయ్యే అవకాశం ఉందని, ఇది వైసీపీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇకనైనా జగన్ జాగ్రత్త పడితే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.