అదే జరిగితే వైసీపీ చాప్టర్ క్లోజ్

ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. అధికార పార్టీ అభివృద్ధే మంత్రంగా ఎన్నికలకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి. వాటిలో ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. అయితే, ఆ పార్టీ ఆశించిన మేర ఆకట్టుకోలేకపోతోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏం చేసినా అదే వారికి మైనస్ అవుతోంది. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పేరుకే గానీ ఏ రోజూ ప్రజల పక్షాన నిలిచింది లేదనే అపవాదును ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయడంతో పాటు వైసీపీ ఇప్పటికే రెండు సెషన్లుగా.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. దీంతో ప్రతిపక్ష పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరో తేదీ నుంచి 16వ తేదీ వరకూ జరిగే అవకాశం ఉండడంతో వైసీపీ ఈ సారైనా సభలకు హాజరవుతుందా..? లేదా..? అనే అసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

కొద్దిరోజుల కిందట ప్రత్యేక హోదా ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో వైసీపీ అధినేత.. తమ పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామా చేయించాడు. ఇది ఆ పార్టీకి ఎంతో ప్లస్ అవుతుందని భావించినా.. అది కాస్తా వ్యతిరేకమైంది. అప్పట్లో జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారు. ఈ విషయంలో టీడీపీకి చాలా మైలేజ్ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలోని కొంతమంది నేతలు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి టీడీపీపై ఒత్తిడి తీసుకొద్దామని జగన్‌కు సలహా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనినే ఆరు నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల సమయంలో చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో సభలకు హాజరవడం ఇష్టంలేని వైసీపీ ఇలా చేసైనా అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని అనుకుంటున్నారని సమాచారం. అయితే జగన్ నిర్ణయాన్ని పార్టీలోని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎంపీలతో రాజీనామా చేయించి తప్పు చేశామని, ఏపీ ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోయామని వారు జగన్ వద్ద వాపోయారని తెలిసింది. మొత్తానికి వైసీపీ రాజీనామా నిర్ణయం తీసుకుంటే ఇక ఏపీలో ఆ పార్టీ చాప్టర్ క్లోజ్ అవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.