మోత్కుపల్లికి వైసీపీ బంపర్ ఆఫర్

మాజీ మంత్రి, టీడీపీ బహీష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు బంపర్ ఆఫర్ దక్కించుకున్నారా..? ఆయనకు ఆఫర్ ఇచ్చిన వారెవరు..? అసలెందుకు ఆయనకు ఆఫర్ ఇచ్చారు..? ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ఎక్కడ చూసినా ఇవే చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్న మోత్కుపల్లి.. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పార్టీ నుంచి బహీష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి ఆయన మరింత రెచ్చిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడించడమే తన లక్ష్యమని, అందుకోసం ఏపీలో యాత్ర చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. చంద్రబాబు ఓడిపోతే తిరుపతి కొండకు వస్తానని మోత్కుపల్లి మొక్కుకున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు.

టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన వెంటనే మోత్కుపల్లిని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలిశారు. హైదరాబాద్‌లోని మోత్కుపల్లి ఇంటికి వచ్చిన ముద్రగడ.. మోత్కుపల్లితో ఏకాంతంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం ‘‘టీడీపీ వేటు వేసినందున మోత్కుపల్లికి సంఘీభావం తెలిపేందుకు వచ్చాను. త్వరలో ఆయన ఏపీలో యాత్ర చేయాలని భావిస్తున్నారని చెప్పారు. దానికి మా సహకారం ఉంటుందని హామీ ఇచ్చాను. అంతేకానీ మా భేటీలో ఏ రాజకీయ చర్చలు జరగలేదు’’ అని ముద్రగడ మీడియాతో చెప్పారు. రెండు రోజుల కిందట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మోత్కుపల్లిని కలవడానికి ఆయన ఇంటికి వచ్చారు. ఈ విషయం మీడియాకు పొక్కడంతో మీడియా ప్రతినిధులు మోత్కుపల్లి ఇంటికి చేరుకున్నారు. వారిని చూసిన విజయసాయి.. మోత్కుపల్లిని కలవకుండానే వెళ్లిపోయారు.

ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మోత్కుపల్లి వెనుక వైసీపీ నేతలు ఉన్నారనే అనుమానం చాలా మందికి వచ్చింది. దీనికి బలాన్ని చేకూర్చే ఓ వార్త ఇప్పుడు బాగా హల్‌చల్ చేస్తోంది. వైసీపీ నేతలు మోత్కుపల్లికి ఓ ఆఫర్ ఇచ్చారట. తెలంగాణలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గమైన ఎంచుకుని చెబితే, అక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున పోటీకి నిలబెడతామని మోత్కుపల్లికి వైసీపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. దీనికి ప్రతిఫలంగా మోత్కుపల్లి ఏపీలో పర్యటించాలని, ఆ పర్యటనలో చంద్రబాబుపై, ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాలని కండీషన్ పెట్టారట. దీనికి ఓకే అన్న మోత్కుపల్లి నా వెంట వచ్చే కొందరికి కూడా టికెట్లు ఇప్పించమని కోరారట. దీనికి వైసీపీ నేతలు సరేనన్నారట.

అయితే, ఈ డీల్ అంతా వైసీపీ కోవర్టుగా భావించే ఓ సామాజిక వర్గానికి చెందిన ఉద్యమ నేత జరిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐవైఆర్ కృష్ణారావు, టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా వైసీపీ సెట్ చేసినవాళ్లే అనే టాక్ ఉంది. అయితే వాళ్లు చంద్రబాబును మాత్రం ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు మోత్కుపల్లిని ఎరగా వాడుకుని చంద్రబాబును దెబ్బకొట్టాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బీజేపీ.. మరో వైపు వైసీపీ.. జనసేన చంద్రబాబును ఇరుకున పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. మరీ, వైసీపీ చేసిన కొత్త ప్లాన్.. వాళ్లకు ఏ మేరకు లాభం చేకూర్చి పెడుతుందో.. లేక చంద్రబాబు ముందు ఇది కూడా తేలిపోతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.